Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

హృదయవిదారకం

కొడుకు చనిపోయినట్లు తెలియక
మృతదేహంతో 4 రోజులు గడిపిన దివ్యాంగ తల్లిదండ్రులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తమ కుమారుడు చనిపోయినట్లు గ్రహించని దివ్యాంగులైన వృద్ధ తల్లిదండ్రులు అతని మృతదేహం పక్కనే నాలుగు రోజులు గడిపారు. కొడుకు వచ్చి భోజనం పెడతాడని ఆకలితో ఎదురు చూశారు. తమ వద్దనే కొడుకు నిర్జీవంగా పడి ఉండటాన్ని గ్రహించలేకపోయారు. ఇంట్లో దుర్వాసన వస్తున్నప్పటికీ ఏదో జీవి చనిపోయిందనుకున్నారే తప్ప అది తమ కుమారుడు మృతదేహం నుంచి వస్తుందని తెలుసుకోలేని స్థితిలో నాలుగు రోజులు గడప దాటలేదు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం… దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకవైపు కుళ్లి పోయిన స్థితిలో మృతదేహం… మరోవైపు ఏమి తెలియని స్థితిలో వృద్ధ దంపతులు ఉండటాన్ని చూసిన పోలీసులు చలించిపోయారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. వృద్ధ తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు తెచ్చి భోజనం పెట్టించారు. ఆపై వారి పెద్ద కుమారుడైన ప్రదీప్‌కు సమాచారమిచ్చారు. ప్రదీప్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నాగోల్‌, జైపురికాలనీ, బ్లైండ్స్‌కాలనీలో ఉండే రమణ (59), శాంతకుమారి (64)కి ఇద్దరు కుమారులు కె.ప్రదీప్‌కుమార్‌, కె.ప్రమోద్‌కుమార్‌ (32). రమణ, శాంతకుమారి ఇద్దరికి కంటి చూపులేదు.. రమణ గిరిజన సంక్షేమ ఉద్యోగి.. కంటి చూపు లేక వేరే వ్యక్తిని తన ఉద్యోగంలో సహాయకుడిగా పెట్టుకున్నారు.పెద్ద కుమారుడు భార్యతో కలిసి వేరుగా ఉంటారు. వృత్తిరీత్యా పెయింటర్‌ అయిన చిన్న కుమారుడు ప్రమోద్‌ కుమార్‌ తల్లిదండ్రుల వద్ద ఉంటాడు. మద్యానికి బానిస కావడంతో ఇతనిని నాలుగేళ్ల కిందట భార్య వదిలేసింది. ప్రమోద్‌ కుమార్‌కు తరచూ ఫిట్స్‌ వచ్చేవి. తండ్రి జీతంపై ఆధారపడి జీవించేవాడు. నాలుగు రోజుల కిందట మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ప్రమోద్‌ కుమార్‌కు ఫిట్స్‌ రావడంతో మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img