Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాలకుల పాపాలు పాలితులకు శాపాలు

బి. లలితానంద ప్రసాద్‌

కరోనా కలవరం ముగియలేదు. ఒలంపిక్‌ అనంతర సంబరాలు సమసిపోలేదు. ఇంతలోనే ఉరుములేని పిడుగులా అఫ్గాన్‌ పరిణామాల ప్రకంపనాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. వాటి ప్రతిధ్వనులు పొరుగున ఉన్న దేశాలకే పరిమితం గాక విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఏది స్థానికతకు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రతిదీ మరొకదానితో ప్రత్యక్ష పరోక్ష సంబంధం కలిగి ఉంటున్నాయి. పాలకులు ఎవరైనా, ప్రభుత్వాలు ఏవైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా పౌరులంతా ఒక్కటే, వారి సాధకబాధకాలు అన్నీ ఒకటే, ఆయా సందర్భాల్లో భావోద్వేగాలూ ఒక్కటే అన్నట్టుగా ఉంది ప్రస్తుత ప్రపంచం పరిస్థితి. ఏ ప్రభుత్వాన్ని అయినా వారు ఎన్నుకునేటప్పుడు వారి జీవితాలకు రక్షణ, భద్రత కల్పించి, వారి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తారని, వివక్షకు గురయ్యే వారిని, అట్టడుగు వారిని, సామాన్యుడిని ఆదుకుంటారని ఆశిస్తారు. ఇందుకు భిన్నంగా పాలకులు వేగిరపాటుతో, అపరిపక్వతతో, దురహంకారంతో, దేనినీ పట్టించుకోనితనంతో చేసే పాపాలన్నీ పలు రూపాల్లో అక్కడి ప్రజల పాలిట శాపాలుగా మారు తున్నాయి. ఇందుకు తాజా నిదర్శనం అఫ్గానిస్తాన్‌. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక చోట్ల లేకపోలేదు. ఎప్పుడూ అన్ని చోట్లా పౌర సమాజమే చెప్పలేనంత ఇక్కట్ల పాలవుతోంది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఏడు నెలలుగా పొందిన మన్ననలన్నీ అఫ్గాన్‌్‌ ఉదంతంతో గాలికి కొట్టుకు పోయాయి. ఇది పూర్తిగా స్వయంకృతం. అందు వల్లనే ఆత్మరక్షణలో పడిపోయాడు. స్వీయసమర్థనకై పాట్లు పడుతున్నాడు. 9/11 నాటికి ఏదో సాధించాలనే తపన ఎన్నో అనర్థాలు తెచ్చి పెట్టింది. ఎప్పుడైతే అఫ్గాన్‌లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తాలిబన్ల ఒప్పందంతో దూరంగా ఉంచారో అప్పుడే ఇప్పటి పరిణామాలన్నింటికీ బీజాలు పడ్డాయి. ఇది అక్కడి అధికారుల అనధికార భావనే కాక అసలు సిసలు వాస్తవం కూడా. పైగా ఇప్పుడు అక్కడ సైన్యం వారిని ఎదుర్కోలేక పోయిందని ఆరోపించడం ఆయనకే చెల్లింది. వారు తవ్విన గోతిలో వారే పడినట్లు అయింది. వారు ఇంతకాలంగా సరఫరా చేసినవన్నీ సునాయాసంగా తాలిబన్ల హస్తగతం అయినాయి. ఇందుకు ఎవరిని నిందించినా నిరుపయోగం. దేశంలోను, మిత్ర దేశాల్లోనే కాక విశ్వవ్యాప్తంగా విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. ఇప్పుడాయన తాలిబన్లను తప్ప మిగతా అందరినీ విమర్శిస్తున్నారు. ఎంత బుకాయించినా బైడెన్‌ ఈ అప్రదిష్ట నుండి బయటపడలేరు. దీని మూల్యం, అక్కడి పౌరుల జీవన దుర్భరత ఏ అంచనాలకీ అందనిది.
అమెరికాకి ఇది అత్యంత దారుణ పరాజయమే కాదు పరాభవం కూడా. అఫ్గాన్‌ ప్రజలకు చేసిన నమ్మక ద్రోహానికి ప్రతిఫలం. బైడెన్‌ ఏ మాత్రం విజ్ఞత ప్రదర్శించినా ఇది పూర్తిగా నివారింపగలిగినది. స్థానికంగా ఇంతకాలం అనేక రూపాల్లో సహకరించిన వేలాదిమందిని గాలికొదిలేశారు. ఎంత త్వరగా వీలైతే అంతత్వరగా ఎంత ఎక్కువమంది వీలైతే అంత ఎక్కువమందిని తరలించటంలో జాప్యం చేశారు. పట్టించుకోవాల్సినంతగా వారిని పట్టించుకోలేదు. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
చరిత్ర అనేక రూపాల్లో పునరావృతమౌతుంది. అమెరికా పాలకులకు ఇలాంటివి కొత్తవి కాదు. గతంలో కెన్నెడీ క్యూబా కైవశానికి ప్రయత్నాలు, జిమ్మీ కార్టర్‌ ఇరాన్‌ అనుభవాలు, వీటన్నిటినీ మించి 1975లో వియత్నాం అనుభవాలు లాంటివి నమోదయ్యాయి. వాటి నుండి ఎలాంటి పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు. తన పార్టీ డెమొక్రటిక్‌ సొంత మీడియా సైతం ‘బైడెన్‌ – సైగాన్‌’ అనడం ఇందుకు తార్కాణం. ఇప్పటి కాబూల్‌ విమానాశ్రయ దృశ్యాలు అప్పటి ‘సైగాన్‌’లో సంభవించినవి ప్రపంచ మీడియా చిత్రాలతో ముద్రించి గుర్తు చేసింది. ఓ నిర్ణయానికి మరో ప్రత్యామ్నాయం లేదు, ఉండదు అనుకోవడం మేధో దారిద్య్రానికి నిదర్శనం.
‘కార్టర్‌ మల్కాజియాన్‌’ కొత్త పుస్తకం ‘ది అమెరికన్‌ వార్‌ ఇన్‌ అఫ్గానిస్తాన్‌’ ప్రకారం ‘ఓటమిలో ఏ మాత్రం అనుమానంలేదు. అమెరికా20 సంవత్సరాలలో రెండు లక్షల కోట్లు ఖర్చు చేసింది. అత్యధిక మిత్రదేశాల దళాలతో కలిపి 1,30,000 మంది. అఫ్గాన్ల సైనిక దళాలు మూడు లక్షల మంది. ప్రపంచం లోనే అత్యాధునిక వైమానిక ఆయుధ సామగ్రి ఉపయోగించారు. అయినా అంతంత మాత్రపు ఆయుధ సంపత్తి గల 75,000 మంది తాలిబన్ల చేతుల్లో ఎందుకు ఓడిపోయినట్లు?’. ‘12 సంవత్సరాలుగా గమనిస్తున్నా … ఎంతో మెరుగైన అధిక సంఖ్యాక సైనికులు యుద్ధం అనంతర యుద్ధంలో ఎలాంటి వనరులు, సరైన నాయకత్వం లేని వారి చేతిలో ఎలా పరాజితులు అయ్యారో అంతుబట్టదు’ అంటారు. దీనికి ఆయనకు తాలిబన్‌ స్కాలర్‌ ఒకరు 2019లో ఇచ్చిన బదులు, ‘వారి పోరాటం విశ్వాసంతో, స్వర్గం కొరకు. అదే అవతలివారి పోరాటం డబ్బు కొరకు’ అని. ఈ భారం అంతా ఎవరు మోస్తారు? ఆ దేశాల ప్రజలే కదా! వారంతా శ్రమించి సంపాదించి చెల్లించిన పన్నుల్లోనుంచే కదా! వాటిని వారి శ్రేయస్సుకొరకు కాక ఇలాంటి వాటి కోసమేనా ఉపయోగించేది? అనే సవాలక్ష ప్రశ్నలకు బదులు ఇచ్చేవారు ఎవరు?
అక్కడ పట్టణీకరణ అంతగా జరగలేదు. గత ప్రభుత్వం గ్రామీణ పరిస్థితులను, ప్రజలను పరిగణలోకి తీసుకోలేదు. వారే తాలిబాన్లకు నిజమైన బలం. అవినీతి అవధులు దాటింది. కీలుబొమ్మ ప్రభుత్వంలో సార్వభౌమత్వం ప్రశ్నార్థకమైంది. ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి, స్వయంకృషికి, మనోస్థైర్యానికి చారిత్రకంగా మారుపేరైన అఫ్గ్గానులు ఎన్నడూ పరాయిసహకారాన్ని అంగీ కరించినట్లుగా కనపడదు. పెత్తనానికి, బానిసత్వానికి వారు తలవంచరు అనటానికి తార్కాణాలు అనేకం. మతోన్మాదం, దాని తాలూకు ఉగ్ర, తీవ్ర వాదుల చర్యలన్నీ ఎవరివైనా పూర్తిగా నివారించాలి, ఖండిరచాలి. అందుకు ప్రపంచమంతా ఏకం కావాలి. మతోన్మాదం ఏదైనా చేటేననే స్పృహ అందరికీ ఉండాలి. అందుబాటులో సమాచారం ప్రకారం ప్రపంచ 10 ఉగ్రవాద సంస్థలో తాలిబన్లది ఐదో స్థానం.
తాలిబన్ల ప్రభుత్వం గతంలో 1996 నుండి 2001 వరకు పాలించింది. అప్పటి అనుభవాలు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అందులోనూ మహిళల మీద ఆంక్షలు, దుర్మార్గాలు ఎంత భయంకరమో ప్రపంచమంతా చూసింది. వారిని పనులకు అనుమతించలేదు. ఇల్లు దాటితే ముఖానికి బురఖా, తోడు పురుషుడు తప్పనిసరి. బాలికలను బడులకు అనుమతించలేదు. టీవీ, సంగీతం, పెయింటింగ్‌, ఫోటోగ్రఫీ లాంటివన్నీ పూర్తిగా బహిష్కరించారు. ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు బలంగా అమలు జరిపారు. అవి తలచుకుని ఇప్పటికే అంతా హడలిపోతున్న సమయంలో తాలిబన్లు తిరిగి వాటినే అమలు చేసేందుక సంసిద్ధమయ్యారు. అంతా భయపడుతున్నట్టుగానే ఆ చీకటి రోజులే తిరిగి వస్తున్నాయనే సంకేతాలను ఇస్తున్నారు. ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలు కూడా ఈ పరిణామాలపై ఎందుకైనా మంచిదని ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఒక్క పాకిస్తానే తమ వ్యాఖ్యలతో తాలిబన్లను గుర్తించినట్లు ప్రకటించింది.
కారణాలేమైనా తాలిబన్లు గతానికి భిన్నంగా ప్రస్తుతం వ్యవహరించడం గమనార్హం. బహుశా ఇది వ్యూహత్మక విధానం కావొచ్చు. దేశం వారి కైవశం కాకముందే కొన్ని దేశాలను సంప్రదింపులతో మంచి చేసుకోవడం ప్రారంభించారు. మరి అఫ్గాన్‌లో పౌర, మానవ హక్కుల మాటేమిటి? బడుగు జీవులకు రక్షణ, భద్రత ఎక్కడ? వివిధ రకాల వివక్షతలు తొలిగేది ఎప్పుడు? పాలకుల పాపాలు ప్రజలకు శాపాలు కాకుండా ఉండేదెప్పుడు?
వ్యాస రచయిత రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img