Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

బొగ్గు గనుల మూసివేత..నిలిచిన సరఫరా..బొగ్గు కార్మికుల అపూర్వ స్పందన

న్యూదిల్లీ: రెండు సార్వత్రిక సమ్మెలో బొగ్గుకార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తిపై దీని ప్రభావం తీవ్రంగా పడిరది. గనులన్నీ ఎక్కడికక్కడ మూతపడ్డాయి. ప్రభుత్వ ఒత్తిడికి కార్మికులు ఎంతమాత్రం తలొగ్గలేదు. హక్కుల సాధన కోసం కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సార్వత్రిక సమ్మెతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడమే కాకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా కాలేదు. ఈ విషయాన్ని హెచ్‌ఎంఎస్‌ అనుబంధ హింద్‌ ఖదాన్‌ మజ్దూర్‌ ఫెడరేషన్‌ వెల్లడిరచింది. మోదీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు సోమవారం నుంచి రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్త సమ్మెలో బొగ్గు కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారని, ప్రభుత్వ రంగ సీఐఎల్‌, బొగ్గు పరిశ్రమ విధ్వంసం లక్ష్యంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కార్మికులు సమ్మెలో పాల్గొనడం ద్వారా తమ అసంతృప్తిని వెల్లడిరచినట్లు స్పష్టంగా కనిపిస్తోందని హింద్‌ మజ్దూర్‌ ఖదాన్‌ ఫెడరేషన్‌ తెలిపింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, సరఫరా ఆగిపోయిందని ఫెడరేషన్‌ అధ్యక్షుడు నాథులాల్‌ పాండే పీటీఐకి చెప్పారు. ఇప్పటి వరకు తమకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా బొగ్గుకార్మికులు అత్యంత ఉత్సాహంతోనూ, తమ ఐక్యతను చాటిచెబుతూ సమ్మెలో పాల్గొన్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికులు ఐక్యతతో, పటిష్టవంతంగా, నిబద్ధతతో తిప్పికొడుతున్నారని వ్యాఖ్యానించారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ కింద లాభసాటిగా నడుస్తున్న 160 గనులను రూ.28,747 కోట్ల నామమాత్రపు ధరకు ప్రైవేట్‌ కంపెనీలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన విమర్శించారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చాలాకాలంగా నిరసనలు, సమ్మెలు కొనసాగిస్తున్నారని, 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్‌కోడ్‌లు తీసుకురావడాన్ని కేంద్ర కార్మిక సంఘాలు, కార్మికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారని గుర్తుచేశారు. వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(డబ్ల్యూసీఎల్‌)లోని నాలుకు కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. డబ్ల్యూసీఎల్‌లో సమ్మె విజయవంతమైనట్లు వివరించారు. ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఈసీఎల్‌)లోని అత్యధిక ప్రాంతాల్లో సమ్మెకు సానుకూల స్పందన లభించిందన్నారు. కచ్చితంగా ఈ రెండు రోజుల్లో కార్మికులంతా సమ్మెలో పాల్గొని తీరతారన్న విశ్వాసం వెలిబుచ్చారు. భారత్‌ కుకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌, మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎంసీఎల్‌)లోనూ సమ్మె విజయవంతమైందని తెలిపారు. కార్మికులు రైళ్లను సైతం ఎక్కడికక్కడ నిలిపివేసినట్లు చెప్పారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాట్లాడుతూ మధ్యాహ్నానికి 80శాతం మంది బొగ్గుకార్మికులు సమ్మెలో పాల్గొన్నారని, కొన్ని కాలరీస్‌ పూర్తిగా మూతపడ్డాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో సమ్మె పూర్తిగా విజయవంతమైనట్లు తమకు సమాచారం వస్తోందన్నారు. ఇది కేవలం బొగ్గుకార్మికుల సమ్మె మాత్రమే కాదని, సార్వత్రిక సమ్మె అని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img