Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

వేకువ రాగం

తుఫాన్‌ సుడిగుండంలో
ముసురు పట్టిన నిశీధి నందు
రాతిరి గాయాలను చెరిపేస్తూ
తూరుపు తలుపులు తెరుచుకుంటూ
నిరీక్షించే ధరణిపై ప్రసరించే
శ్వాసల వెలుగుల కోసం
వేచి ఉండే జగతితో పాటు,
పుడమితల్లి గర్భంలో
పురుడు పోసుకునే
అంకురం కూడా వేకువరాగం
నిశ్శబ్దంగా ఆలపిస్తోంది
భూమిని సైతం చీల్చుకుంటూ
‘మొక్క’ వోని ధైర్యంతో ఎదగాలని
మౌనమునిలా తపస్సు చేస్తోంది
రైతన్నకు సిరుల పంటనందించాలని
తనవంతుగా సాయంగా నిలవాలని
విశ్వ ప్రయత్నమే చేస్తోంది
భూమి పుత్రుని దోసిలిలో
చేరి మురిసిపోవాలని
సూరీడు కిరణాలతో చెలిమిచేసి
భూతలంపై సత్వరమే మొలకెత్తాలని
సర్వ మానవాళి కోసం
ఆకలి తీర్చటమే పరమావధిగా
చీకటి సంకెళ్ళు తెంచుకుని
సస్యశ్యామల క్షేత్రంలో
ఊపిరి పోసుకునే విత్తనం
వెలుతురు బువ్వ కోసం
ఆశగా ఎదురుచూస్తోంది!
ములుగు లక్ష్మీ మైథిలి, 9440088482

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img