Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దళితులకు రక్షణ కల్పించాలి…

టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…
విశాలాంధ్ర`ఏలూరు :
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని, దళితులకు రక్షణ కల్పించాలని టీడీపీ ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత నెల 30వ తేదీన కొమడవోలు గ్రామంలో వాలంటీర్‌ రాకేష్‌ పై అగ్రవర్ణాల పెత్తందారులు, దురహంకారులు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించిన దోషులపై హత్య కేసు నమోదు చేయాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్‌ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న బాలాజీ మాట్లాడుతూ రాకేష్‌పై హత్య చేయడానికి ప్రయత్నించిన అగ్రవర్ణ భూస్వాములపై పోలీసులు కేవలం ఎస్‌ సి , అట్రాసిటీ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.రాకేష్‌ పై దాడి చేసిన దోషులపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.దళితులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు దళితులందరూ ఐక్యంగా ఉద్యమించాలని బాలాజీ పిలుపునిచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి చట్టాన్ని పటిష్టంగా అమలు జరపాల్సిన ముఖ్యమంత్రి చట్టాన్ని అతిక్రమిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధిలో దళితులకు అన్యాయం జరుగుతుందని గౌరవప్రదమైన ఉపాధి దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లోనూ దళితులు తీవ్ర వివక్షతకు గురవుతున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులు వేరే ఖాతాలకు మళ్లిస్తూ దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ నిరోధక చట్టం బలోపేతం చేయాలని, ఎస్‌సి, ఎస్‌ టి, సబ్‌ ప్లాన్‌ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, ఏలూరు మండల అధ్యక్షులు నేతల రవి, మాజీ ఎంపీపీ ఎం మాణిక్యాలరావు, అలాగా రవికుమార్‌, కందుల రమేష్‌, వివిధ డివిజన్లలో వచ్చిన దళిత, మహిళా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img