Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంగన్వాడీల అవస్థలెన్నో….

పట్టించుకోని ప్రభుత్వం…

సిబ్బంది జీవితాలు కుదేలు…

కుంటుపడుతున్న వ్యవస్థ…

విశాలాంధ్ర – పెనుమంట్ర: రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలు, చిన్నారుల యోగక్షేమాలు చూసే అంగన్వాడీ సిబ్బంది అవస్థలు చెప్పజాలనవి కాకుండా ఉన్నాయి. గర్భిణీలు, ఆరేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం అందించడం, ప్రాథమిక విద్యకు అలవాటు చేయడం వంటి పలు కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు విధిగా హాజరవుతూ తక్కువ వేతనాలకు విశిష్ట సేవలందిస్తున్నారు. అయితే వారి సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేయడంతో వారిజీవితాలుకుదేలవుతున్నాయి. దరిమిలా అంగన్వాడి వ్యవస్థ కుంటు పడే విధంగా తయారయింది. గర్భం దాల్చిన క్షణం నుంచి కాన్పు అయ్యేంత వరకే కాకుండా, వారికి పుట్టిన చిన్నారుల యోగక్షేమాలు చూసే అంగన్వాడి వ్యవస్థ ప్రభుత్వ తీరు కారణంగా ఇబ్బందుల్లో పడుతుంది. అంగన్వాడీలు సకాలంలో సేవలు అందించకపోతే నానా బీభత్సం సృష్టించే అధికారులు వారికి అందాల్సిన సౌకర్యాల విషయంలో మాత్రం మిన్నకుండిపోతున్నారు. ఇటు ప్రజలు, అటు అధికారుల మధ్య నలుగుతూ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నవారు పొట్టకూటి కోసం అన్ని బాధలు భరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగిన భారీ మూల్యం చెల్లించే విధంగా ఉండే అంగన్వాడీల సేవలకు తగిన ప్రోత్సాహం, ఆర్థిక సౌలభ్యం లేక విలవిల్లాడుతున్నారు. తక్కువ వేతనానికి పనిచేస్తున్న అంగన్వాడీలకు 3 నెల కావస్తున్న జీతాలు కూడా అందడం లేదు. అంతే గాకుండా ప్రతి నెల గ్యాస్ సిలిండర్లకు చెల్లించే సొమ్ము, అంగన్వాడి కేంద్రాల అద్దెలు, సమావేశాలకు హాజరైతే ఇవ్వాల్సిన టీఏ, డిఏ అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషక ఆహారం అందించేందుకు వారి అంగన్వాడి సహాయకుల ఆధ్వర్యంలో వంట వండి అందజేస్తారు.ఇందుకు అవసరమైన గ్యాస్ సిలిండర్లు వారే కొనుగోలు చేసి ప్రభుత్వం చెల్లించిన సమయంలో తీసుకుంటారు. గత నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గ్యాస్ సిలిండర్ల బిల్లులు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడి కేంద్రాలకు చెల్లించే అద్దె సైతం గత నవంబర్ నెల నుంచి రావడంలేదని, ఇక సమావేశాలకు హాజరైతే ఇచ్చే అలవెన్స్ కూడా 2019 వ సంవత్సరం నుంచి ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. దీంతో తమకు వచ్చే జీతం అద్దె, గ్యాస్ సిలిండర్లు, సమావేశాలకు వెళ్లి వచ్చే ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని కలుపుకుని సీనియార్టీని బట్టి రూ.11,500 లకు మించి జీతం రాదని అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిస్థాయి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు రాక పోవడంతో జీవితం దుర్భరంగా తయారైందని అంగన్వాడీలు కన్నీరు పెట్టుకుంటున్నారు. అధికారులు గుడ్లు, పాలుకు చెల్లిస్తున్నట్లుగా తమకు ఎందుకు చెల్లించలేకపోతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమ ఆవేదన అర్థం చేసుకుని తమకు రావాల్సిన జీతాలతో పాటు ఇతర ఖర్చులు వెంటనే చెల్లించి ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img