Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

క్రిమినల్‌ కేసులో ఇరికించిన పోలీసు, ఆంధ్ర యూనివర్సిటీ, జిల్లా విద్యాశాఖ అధికారులకు షాక్‌…

విశాలాంధ్ర-ఏలూరు : క్రిమినల్‌ కేసులో అక్రమంగా ఇరికించినందుకు ఏలూరుకు చెందిన అప్పటి పోలీసు అధికారులకు, అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ, ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఏలూరు లోని మెజిస్ట్రేట్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ పి.పరేష్‌ కుమార్‌ జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే 15 రోజులు జైలుకు ఎందుకు పంపకూడదో నోటీసులు జారీ చేయాలని ఇటీవల సంచలన తీర్పు చెప్పారు. కేసు పూర్వపరాలు పరిశీలిస్తే పుచ్చా ఆనంద వెంకటలక్ష్మి బిఎ డిగ్రీ ఉత్తీర్ణత కాకుండానే దొంగ సర్టిఫికెట్‌ సృష్టించారని, ఆ అర్హతతో టీచర్‌ పోస్ట్‌ సంపాదించి 14 సంవత్సరాలు పని చేశారని ఆరోపణ. ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌ గా ఉన్న ఆమె భర్త శివరామ కుమార్‌ ఆమెను ప్రోత్సహించి విద్యా శాఖను, ప్రభుత్వాన్ని మోసం చేశారని పేర్కొంటూ విద్యాశాఖ అధికారులు 2015 జూన్‌ 10వ తేదీన ఏలూరు 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మొబైల్‌ కోర్టులో అప్పటి పోలీసులు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు.1994 లో ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన బిఎ 3 సంవత్సరాల కోర్సులో సింగిల్‌ సిట్టింగ్‌ లో ఉత్తీర్ణత పొంది ఆ తర్వాత బీఈడీ చేసి ఉత్తీర్ణురాలై 2000 సంవత్సరంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ గా జాయిన్‌ అయి 14 సంవత్సరాలు పనిచేశారు. అప్పటి డిప్యూటీ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ విజయ ఏంజిల్‌ అనే అధికారి 2015లో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా 2018లో భార్యాభర్తల పైన చార్జి షీట్‌ దాఖలు చేయడంతో ప్రభుత్వం భార్యాభర్తలను ఉద్యోగం నుండి తొలగించింది. సుదీర్ఘకాలం జరిగిన విచారణలో 11 మంది సాక్ష్యం కోర్టు విచారించింది. అప్పటి టీచర్స్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఆర్‌ సూర్యారావు ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా ఆంధ్రా యూనివర్సిటీ అధికారులను కోరగా సర్టిఫికెట్‌ ఒరిజినల్‌ అని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. టీచర్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ అసలు దేనిని నిర్ధారణకు వచ్చిన తరువాత ప్రముఖ న్యాయవాది రోనాల్డ్‌ రాజు బాధితుల తరఫున వాదించారు. ఆంధ్ర యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, రికార్డులు సరిగా పరిశీలించకుండా 2014లో మార్చి 29 నవంబర్‌ 5వ తేదీన, 2016లో ఏప్రిల్‌ 14వ తేదీన విద్యా శాఖకు, పోలీసు అధికారులకు ఆనందలక్ష్మి డిగ్రీ సర్టిఫికెట్‌ నకిలీదని లిఖితపూర్వకంగా ఇచ్చారు. సుదీర్ఘకాలం సాగిన ఈ కేసును విచారించిన ఏలూరు మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ పి పరేష్‌ కుమార్‌ గత సంవత్సరం డిసెంబర్‌ 16వ తేదీన సంచలనాత్మక తీర్పు చెప్పారు. టీచర్‌, కరస్పాండెంట్‌ నిర్దోషులని తప్పుడు కేసు పెట్టిన ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ పి ఎస్‌ ఎల్‌ ఎం విజయ ఏంజెల్‌, అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టర్‌ జే ఆదిలక్ష్మి, ఆంధ్ర యూనివర్సిటీ జాయింట్‌
రిజిస్త్రా ర్‌ స్వీతి సుధాకర్‌ రెడ్డి, అప్పటి సిఐ కె. నాగేంద్ర ప్రసాద్‌, అప్పటి 1వ పట్టణ ఎస్‌ కె.రామారావులకు టీచర్‌ దంపతులకు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే 15 రోజులు జైలుకు ఎందుకు పంపకూడదో ఈ 5గురు అధికారులకు నోటీసులు జారీ చేయాలని మెజిస్ట్రేట్‌ పరేష్‌ కుమార్‌ తీర్పు చెప్పారు. ఇటీవల తప్పుడు కేసులు బనాయించి, అబద్ధ సాక్షాలు సృష్టించి పలువురుని ఇబ్బంది పెడుతున్న వారికి ఈ తీర్పు గుణపాఠంలా భావించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img