Friday, April 26, 2024
Friday, April 26, 2024

టిడ్కో గృహాలు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి..

సీపీిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య
విశాలాంధ్ర`ఏలూరు : టిడ్కో గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీిఐ ఏలూరు సమితి ఆధ్వర్యంలో సీపీఐ జిల్లా ప్రతినిధి బృందం స్థానిక పోణంగి వద్ద గల టిడ్కో గృహాలను సందర్శించింది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ, టిడ్కో గృహాలను లబ్ధిదారులకుస్వాధీనం చేయాలని సీపీిఐ అనేకసార్లు పోరాటం చేసిందన్నారు. ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసం తేదీలను మారుస్తూ టిడ్కో స్వాధీనం చేయకుండా లబ్ధిదారులను మభ్యపెడుతుందని విమర్శించారు. ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలలో కనీస సౌకర్యాలు లేవని ప్రాథమిక దశలోనే అసంపూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు.మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు నిర్మించలేదని గృహాల మధ్య చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పెరిగి నిలయాలకు అనుకూలం లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం 2023 జనవరి లోపు లబ్ధిదారులకు అందజేస్తామని చెబుతుందని పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసి తక్షణం అందజేయాలన్నారు.ఎవరైతే లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదును డీడీ రూపంలో చెల్లించారో వారికి న్యాయబద్ధంగా స్వాధీనం చేయాల్సిన టిడ్కోగృహాలను అందజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అపహాస్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే కమ్యూనిస్టులపై కాకుండా ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి ప్రజారంజక పాలన కొనసాగించాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 2019లో అప్పటి ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో పేదలకు టిడ్కో గృహాలు నిర్మించి ఇవ్వాలని సంకల్పించిందన్నారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు.గృహాలు నిర్మించి ప్రస్తుతం 3 సంవత్సరాలు పూర్తయినా లబ్ధిదారులకు అందజేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. టిడ్కో ఇళ్లపై సీపీిఐ చేసిన పోరాటాల ఫలితంగా 2023 ఫిబ్రవరి లోపు లబ్ధిదారులకు గృహాలను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే టిడ్కో గ్రహాలు లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. సీపీిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌ మాట్లాడుతూ, టిడ్కో గృహాల నిర్మాణాలు కొన్నిచోట్ల అసంపూర్తిగా ఉన్నాయన్నారు. గృహాల నిర్మాణానికి సంబంధించిన పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు.నివాసానికి అనువుగా లేవన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పర్యటనలో సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, సీపీఐ ఏలూరు ఏరియా సమితి సభ్యులు ఎం ఏ హకీమ్‌,మావూరి విజయ, తెర్లాపు శ్రీను, గొర్లి స్వాతి, బుగ్గల ప్రభాకర్‌, మన్నే శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img