Friday, April 26, 2024
Friday, April 26, 2024

కష్టజీవులకు అండగా ఎర్రజెండా

సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య

కుక్కునూరు: కష్టజీవులకు అండగా ఎర్రజెండా ఎప్పుడు ఉంటుందని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తెలిపారు. కుక్కునూరు వేలేరుపాడు మండలాల సిపిఐ మండల కౌన్సిల్ సభ్యుల సమావేశం శనివారం కుక్కునూరులో సిపిఐ నాయకులు కొన్నే లక్ష్మయ్య, కారం దారయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిత తాడిత పేద ప్రజల హక్కుల కోసం, పాలకుల అక్రమాల నుండి ప్రజలను కాపాడుతూ నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ అని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే కర్షక, కార్మిక చట్టాలు అమలు చేయాలని పోరాటాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో భారతదేశ వ్యాప్తంగా పీడిత వర్గాల పక్షాన నిలబడి దోపిడి వర్గాల గుండెల్లో గునపం దింపిన జెండా ఎర్రజెండా అని కొనియాడారు. దోపిడి ఉన్నంతకాలం, ప్రజల మధ్య అసమానతలు ఉన్నంతకాలం సిపిఐ ఎర్ర జెండా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ సరళీకరణ, ప్రైవేటీకరణ పేరట ప్రజలపై పెను భారాలను మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ,వంట నూనె ధరలతో పాటు రైల్వే బస్సు చార్జీలు పెంచుతూ ప్రజలను కష్టాలకు గురి చేస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్ టి, అగ్నిపద్ వంటి అనాలోచిత చెత్త విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. బావప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తూ, లౌకిక రాజ్యాంగ వ్యవస్థకు ముప్పు వాటిల్లే విధానాలను అవలంబిస్తుందని దుయ్యబట్టారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి బిజెపి చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత 8 సంవత్సరాల కాలంలో మైనార్టీలు, దళితులు, మహిళలు అణగారిన వర్గాలపై దాడులు ఆగత్యాలు పెచ్చిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ ఉచితాలు పేరట ప్రజలను మభ్యపెడుతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కొరకు పాలకులు చర్యలు తీసుకోవడం లేదని, త్వరలోనే సిపిఐ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమం రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. సిపిఐ జాతీయ మహాసభలు పురస్కరించుకొని అక్టోబర్ 14న విజయవాడ నగరంలో భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతుందని, అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారని, వెయ్యి మంది ప్రజలతో 30 దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీ విదేశీ ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రదర్శన బహిరంగ సభకు కుక్కునూరు వేలేరుపాడు మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు విజయవాడకు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు నూతనంగా జిల్లా కార్యదర్శిగా ఎంపికై తొలిసారి కుక్కునూరుకు విచ్చేసిన సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్యకు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల కార్యకర్తలు పూలమాలలు వేసి శాలువాలులతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎం.డి మునీర్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మైసాక్షి వెంకటాచారి బాడిస రాము, అయితా సురేష్, కొన్నె లక్ష్మయ్య కూరాకుల బాబురావు, సోడె రాంబాబు, జంపన వెంకట రమణ రాజు,పి.బాలకృష్ణ ,కరటం వెంకటేశ్వరరావు, కురుమళ్ళ వెంకటేశ్వరరావు, ఎర్రా మధు, సోడె రమాదేవి , సిపిఐ కుక్కునూరు మండల నాయకులు మడిపల్లి రమణయ్య, సోడె నాగేష్ వరసా పాపారావు వరసా నాగేశ్వరరావు పూరెం లక్ష్మయ్య, ఉంగా, దేవా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img