Friday, April 26, 2024
Friday, April 26, 2024

భరోసా కాదు పరిహారం చెల్లించండి

సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భరోసాతో సరిపెట్టకుండా ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా ముంపు ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని విమర్శించారు. రేషన్ కార్డు దారునికి మనిషికి 5కేజీల బియ్యం,అర కేజీ చొప్పున 4 రకాల కూరగాయలు, పంపిణీ చేసి ప్రభుత్వ యంత్రాంగం చేతులు దులుపుకుందని ఆరోపించారు. అకస్మాత్తుగా వరద రావడంతో ప్రజలు కొండగట్లపై తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుని బిక్కుబిక్కుమంటూ విష జంతువుల మధ్యలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారికి త్రాగునీరు సౌకర్యం కూడా సక్రమంగా సరఫరా చేసిన పాపాన పోలేదన్నారు. రాత్రి సమయాలలో ఉండటానికి కనీసం కిరోసిన్ కూడా సరఫరా చేయలేదన్నారు.కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో మాత్రమే సౌకర్యాలు ఉన్నాయని, మిగిలిన చోట్ల ప్రజలు దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. కుక్కునూరు మండలం కివ్వాక, వేలేరుపాడు లోని బండ్ల బోరు తోపాటు రెండు మూడు ప్రాంతాలలో మాత్రమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. కుటుంబానికి ఇచ్చిన రూ.2వేలు ఇంటిలో ఉన్న బురద తీయడానికి కూడా సరిపోదు అన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్లు వారి ఖాతాలలో వేసామని చెబుతున్నారని, గత ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం మాత్రమే పరిహారం చెల్లించారన్నారు. ఆ ప్యాకేజీని చూసి ఆనందించే కంటే నిర్వాసితులు ఆందోళనలో ఉన్నారన్నారు.ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నాటి ఎన్నికల సందర్భంగా ప్రతి ఎకరాకు సమానంగా రూ.10 లక్షలు చెల్లిస్తానని వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు కావస్తున్నా పరిహారం మాత్రం అందలేదు. వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం తక్షణమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసి రూ.10 లక్షల నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పక్కా గృహాలు నిర్మించి ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వాసితుల సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img