Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

టీకా పంపిణీపై కేంద్రం గొప్పలు

100 కోట్ల పంపిణీకి ఇన్ని రోజులా?
మోదీ చెబుతున్నదంతా అరకొర సమాచారం : కాంగ్రెస్‌

న్యూదిల్లీ : కోవిడ్‌ వాక్సిన్‌ 100 కోట్ల డోసుల పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ అర్ధ సత్యాలను ప్రజల ముందుంచుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చేసిన కృషిని తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించింది. మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వంపై మండిపడిరది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ మాట్లాడుతూ మోదీ తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారన్నారు. మన దేశ శాస్త్రవేత్తలు, పరిశోధకుల కఠోర శ్రమను మోదీ గుర్తించడం లేదన్నారు. భారతదేశం వాక్సిన్‌ను తయారు చేయడం ఇదే తొలిసారి అని మోదీ అంటున్నారని, ఆయన మన పరిశోధకులు, శాస్త్రవేత్తల కృషిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 1985లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ ఆరు వ్యాధులకు టీకాకీరణను ప్రారంభించారన్నారు. సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తుచేశారు. కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని రాజీవ్‌గాంధీ ప్రారంభించారన్నారు. మోదీ మాదిరిగా ఆయన ఎటువంటి ఆర్భాటాలు చేయలేదన్నారు. తక్కువ జనాభాగల దేశాలతో భారతదేశాన్ని మోదీ పోల్చుతున్నారన్నారు. చైనా 216 కోట్ల వాక్సిన్‌ డోసులు ఇచ్చిందని, జనాభాలో 80 శాతం మందికి రెండు డోసులు ఇచ్చిందని తెలిపారు. భారతదేశం కేవలం 21 శాతం జనాభాకే రెండు డోసుల వాక్సిన్‌ను ఇచ్చిందన్నారు. కోవిడ్‌ మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు క్షమాపణలు చేప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అసమర్థత, దయనీయమైన పాలన కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img