Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విద్యార్థులపై పోలీసు జులుం

‘ఎయిడెడ్‌ ప్రైవేటీకరణ’ నిర్ణయంపై అనంతలో నిరసన

విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలపై లాఠీఛార్జి
అనేకమందికి తీవ్ర గాయాలు..
విద్యార్థిని తలపగిలేలా కొట్టిన ఖాకీలు
ఖండిరచిన రాజకీయ, ప్రజాసంఘాల నేతలు

విశాలాంధ్ర బ్యూరో ` అనంతపురం : విద్యార్థులపై పోలీసులు దమనకాండకు ఒడిగట్టారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వారిపై విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారు. వారిని దారుణంగా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. శాంతియుత ఉద్యమాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడాన్ని అనేక రాజకీయ, ప్రజాసంఘాల నేతలు ఖండిరచారు. లాఠీఛార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో అనంతపురం నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ విద్యాసంస్థల ఆవరణలో విద్యార్థులు, నాయకులు ధర్నా నిర్వహించారు. అయితే అనంతపురం డీఎస్పీ, సీఐలతోపాటు పోలీసులు ఒక్కసారిగా వచ్చి విచక్షణారహితంగా విద్యార్థులపై లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఉన్నపళంగా ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రైవేట్‌ యజమానులకు అప్పగిస్తే ఎక్కడ చదువుకోవాలని విద్యార్థులు పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోహర్‌, సూర్య చంద్ర మాట్లాడుతూ ఎయిడెడ్‌ విద్యా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. శాంతియుత నిరసన కార్యక్రమాలపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. విద్యార్థులను ఫీజుల భారం నుండి కాపాడాలని అన్నారు. ఇప్పటికే ఎస్‌ఎస్‌బీఎన్‌ విద్యాసంస్థలలో అనేక అక్రమాలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికి ఇప్పుడు ఫీజులు పెంచితే ఎక్కడకు వెళ్లి చదువుకోవాలో దిక్కుతోచని స్థితిలోకి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడిపోయారన్నారు. పోలీసులు ఒంటెద్దు పోకడలతో విచక్షణారహితంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణం ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యథావిధిగా నిర్వహించాలని అన్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img