Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యుత్‌ వ్యయాలు తగ్గించాలి

వినియోగ సేవలను మెరుగుపర్చాలి
ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ సూచన

న్యూదిల్లీ : విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలకు అధికంగా బకాయి పడి ఉన్నందున రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కేంద్ర మంత్రి ఆర్‌.కె.సింగ్‌ కోరారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుందని, అలాగే వినియోగ సేవలను మెరుగుపర్చడం, విద్యుత్‌ ఖర్చును తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. ఇక్కడ విద్యుత్‌ రంగ సీపీఎస్‌యూలకు చెందిన సీఎండీలు/ఎండీలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యుత్‌, శక్తి విభాగాల ప్రిన్సిపల్‌ కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులతో సింగ్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఒక సమీక్ష సమావేశంలో ఈ సూచన వచ్చింది. రెండు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి క్రిషన్‌ పాల్‌ గుర్జార్‌, పునరుత్పాదక శక్తి శాఖ సహాయ మంత్రి భగవంత్‌ కుభా పాల్గొన్నారు. సింగ్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ, విద్యుత్‌ రంగాన్ని ప్రస్తుత ప్రభుత్వం చాలా ముందుకు తీసుకువెళ్లిందని అన్నారు. ‘దేశం విద్యుత్‌ మిగులుగా మారింది. మేము మొత్తం దేశాన్ని ఒకే గ్రిడ్‌లో అనుసంధానించాం. పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశాం. ఈ చర్యల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 22 గంటలకు, పట్టణ ప్రాంతాల్లో 23.5 గంటలకు విద్యుత్‌ లభ్యత పెరిగింది. తదుపరి దశ సరసమైన ధరకు వారంలో 24 గంటలూ హామీతో కూడిన విద్యుత్‌ సరఫరాకు తీసుకువెళ్లడం’ అని మంత్రిని ఉటంకిస్తూ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్‌ ఉత్పాదక సంస్థల (జెన్‌కోలు) బకాయిలు పెరుగుతున్న విషయాన్ని కూడా చర్చించామని అన్నారు. పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) తక్షణమే సరైన మీటరింగ్‌, బిల్లింగ్‌, ఎనర్జీ అకౌంటింగ్‌ ద్వారా నష్ట తగ్గింపు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే రాయితీల సక్రమమైన లెక్కలు, డిస్కమ్‌లకు చెల్లింపులు కూడా ఉండేలా చూడాలి. డిస్కమ్‌ల మెరుగైన ఆర్థిక స్థిరత్వం మొత్తం విద్యుత్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా తగ్గిన విద్యుత్‌ ఖర్చు, మెరుగైన వినియోగదారుల సేవల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని పునరుద్ఘాటించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు విద్యుత్‌ లభ్యత ప్రాథమికమైనదని, ఈ దేశ పౌరులకు ప్రపంచ స్థాయి సేవలు, సౌకర్యాలను అందించడమే లక్ష్యమని సింగ్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ రంగం అభివృద్ధిని ముందుకు తీసుకెళుతూనే రాబోయే తరాలకు పర్యావరణాన్ని కాపాడేందుకు మరింత గ్రీన్‌ ఎనర్జీ వైపు ఇంధన పరివర్తనపై మంత్రి ఉద్ఘాటించారు. పీఎం`కుసుమ్‌ పథకంకు చెందిన అనేక రకాల ప్రయోజనాలను ప్రధానంగా అదనపు ఆదాయం, రైతులకు చౌకైన విద్యుత్‌ రూపంలో ఉద్ఘాటించారు. సబ్సిడీ భారం తగ్గడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. దీని వల్ల పర్యావరణంతోపాటు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి రూపంలో కూడా మేలు జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రాల వారీగా అమలు తీరు, ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. సౌభాగ్య పథకం కింద 100 శాతం విద్యుదీకరణను సాధించడంలో రాష్ట్రాలు చేస్తున్న కృషి, సహకారాన్ని విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి క్రిషన్‌ పాల్‌ గుర్జార్‌ ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img