Friday, April 26, 2024
Friday, April 26, 2024

చక్కెర ఫ్యాక్టరీలకు బ్యాంక్‌ గ్యారంటీ ఏదీ?

ఉద్ధవ్‌ ప్రభుత్వంపై అమిత్‌షా మండిపాటు
ముంబై : మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై కేంద్ర హోం, సహకారశాఖమంత్రి అమిత్‌షా శనివారం మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకు చెందిన సుగర్‌ ఫ్యాక్టరీలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వడం లేదని ఆరోపించారు. అహ్మద్‌నగర్‌ జిల్లాలో సహకార రంగానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడారు. ‘ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన సుగర్‌ ఫ్యాక్టరీలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వకపోవడం నేను గమనించాను. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో గల చక్కెర మిల్లుల సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాయి. ఈ సమస్యను న్యూదిల్లీ దాకా ఎందుకు తీసుకొస్తున్నాయి’ అని అమిత్‌షా ప్రశ్నించారు. ‘ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సహకారరంగంపై నేను మౌన ప్రేక్షకుడిగా ఉండాలని కోరుకోవడం లేదు. మహారాష్ట్రలో సహకార ఉద్యమానికి ఓ చరిత్ర ఉంది’ అని గుర్తుచేశారు. చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు ఎవరు? వారి రాజకీయ నేపథ్యం ఏమిటి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని ఆయన చెప్పుకొచ్చారు. సహకార రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. పోటీతత్వం పెంచాలని సూచించారు. మహారాష్ట్రలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఇంతకుముందు అద్భుతంగా పనిచేశాయని, ఇప్పుడు వాటి పనితీరు దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ బ్యాంకులు కుదేలవడానికి అవినీతి ప్రధాన కారణమని చెప్పారు. ఆర్‌బీఐ నిబంధనలు అమలు చేయడం లేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img