Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పెట్రోలు, డీజిల్‌.. ధరలు తగ్గించే వరకు పోరాటం

పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌ రెడ్డి డిమాండ్‌
తిరుపతిలో పెట్రోల్‌ బంకుల వద్ద ప్రచార ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో ` తిరుపతి : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించే వరకు పోరాటం సాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గించకపోగా లీటర్‌కు రూ.100 దాటించారని మండిపడ్డారు. పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ తిరుపతి నగర సమితి అధ్వర్యంలో తిరుపతి నగర పరిధిలోని పెట్రోల్‌ బంకుల వద్ద మొదటి రోజు వినియోగదారులకు కరపత్రాలు పంచుతూ ప్రచార ఆందోళన నిర్వహించారు. ఈ నెల 19న సీపీఐ అధ్వర్యంలో జరిగే ప్రజా బ్యాలెట్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.70గా ఉన్న దానిని వంద రూపాయలు దాటించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాల పన్నులు వేయడంతోనే ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు. ఒకే దేశం ఒకే పన్ను ఒకే తిండి అంటున్న మోదీ పెట్రోలు, డీజిల్‌ ధరలను ఎందుకు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. జీఎస్‌టీ కిందకు పెట్రో ఉత్పత్తులు తీసుకువస్తే లీటర్‌ కేవలం 60 రూపాయలకే వినియోగదారులకు దక్కుతాయని అన్నారు. తద్వారా నిత్యావసర ధరలను అదుపు చేయడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. పెంచిన ధరలను తగ్గించే వరకు సీపీఐ అధ్వర్యంలో దశల వారీ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్‌, కె.వై.రాజా, ఎన్‌.శివ, మంజుల, ఎం.ఆర్‌.బాబు, పద్మనాభరెడ్డి, రామచంద్రయ్య, లక్ష్మీ, రాంబాబు, ప్రమీల, బాబు, కోటయ్య, సూరి పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు టి.జనార్ధన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వెంకటేష్‌, నాగిరెడ్డి బైరాగి పట్టడి సర్కిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు పి.మురళి, ఆటో యూనియన్‌ నాయకులు శ్రీదేవి కాంప్లెక్స్‌ పక్కన పెట్రోల్‌ బంకు వద్ద, అలాగే నగర కార్యవర్గ సభ్యులు కె.రాధాకృష్ణ, ఎండి రవి, సిహెచ్‌ శివ, వైయస్‌ మణి, మహేంద్ర, తంజావూరు మురళి, శ్రీను తదితరులు మహల్‌ సర్కిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img