Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యార్థులు కన్నా…ఎన్నికలే ముఖ్యమా!

ప్రధాని తీరుపై మమత ఆగ్రహం
వారణాసి : ఉక్రెయిన్‌ `రష్యాల మధ్య సాగుతున్న యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని కేంద్రం గాలికి వదిలేసిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. యుద్దం కారణంగా అతలాకుతలమై ఉక్రెయిన్‌లోనే చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడం కన్నా ముఖ్యమైనది ఏమిటంటూ ప్రధాని మోదీని సూటిగా నిలదీశారు. బీజేపీని ఓడిరచాలని సమాజ్‌వాదీ పార్టీ కూటమికి మద్దతుగా యూపీలోని వారణాసిలో ఆమె గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కష్టసమయాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రధాని మోదీ ఆ విషయాన్ని పక్కనపెట్టి యూపీ ఎన్నికల సమావేశాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను క్షేమంగా తరలించడం ముఖ్యమా…లేక వారణాసిలో ఎన్నికల సమావేశాలు ముఖ్యమా అంటూ నిలదీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉంటే, యుద్దం తప్పదని మూడు నెలల కిందే తెలిసినా ఉక్రెయిన్‌లోని భారతీయులను ఎందుకు వెనక్కు తీసుకురాలేదని ప్రశ్నించారు. కరోనా సమయంలో మోదీ తీసుకున్న అనాలోచిత లాక్‌డౌన్‌, ఇతర చర్యలతో వలసకార్మికుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని దుయ్యబట్టారు. తాను ఎన్నికల ప్రచారంకి వస్తున్నానని తెలిసి తనను నిలువరించాలని బీజేపీ శ్రేణులు చూడడంపై ఫైర్‌ అయ్యారు. తను ఒక ఫైటర్‌నని, ఎవ్వరికీ బెదరనని స్పష్టం చేశారు. బీజేపీ నేతలకు హింసను ప్రోత్సహించడం తప్ప మెదడులో ఉంకేమీ లేదని వ్యాఖ్యానించారు. బుధవారం తాను వారణాసిలో అడుగు పెట్టగానే తనపై దాడి చేయాలని చూశారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే తన కారుకు అడ్డం పడాలని చూశారని దుయ్యబట్టారు. ఒక్కసారి కాదు యూపీకి వెయ్యిసార్లు వస్తానంటూ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి తదితర ప్రాంతాల్లో ఓటమి తప్పదనే భయంతో మోదీ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం ఆయన ఏకంగా మూడు రోజులు వారణాసిలోనే తిష్ట వేస్తున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img