Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

పార్లమెంటులో పీఎఫ్‌ మంటలు

వడ్డీరేటు తగ్గింపుపై సీపీఐ, విపక్షాల ఆగ్రహం
న్యూదిల్లీ
: ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌)పై వడ్డీరేటు తగ్గించాలన్న ప్రతిపాదనను వామపక్షాలు, తృణమూల్‌, డీఎంకే ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వేతనజీవులపై మోదీ సర్కారుకు ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించాయి. ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 8.5శాతం నుంచి 8.1శాతానికి తగ్గిస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ ఇటీవల ప్రకటించింది. దీనిపై పార్లమెంటు దద్దరిల్లింది. ఈపీఎఫ్‌ వడ్డీరేటును 8.5శాతానికి పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెన్షన్‌ పథకం కింద నెలకు రూ.3వేల కనీస పెన్షన్‌ను ఖరారు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.18 వేలు, నెలవారీ పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలని ఏడో వేతన కమిషన్‌ సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. పీఎఫ్‌పై వడ్డీరేటు తగ్గింపును రాజ్యసభలో సీపీఐ సభ్యుడు వినయ్‌ విశ్వం ప్రస్తావించగా తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. లోక్‌సభలో డీఎంకే సభ్యుడు టీఆర్‌ బాలు ప్రస్తావించగా తృణమూల్‌ సభ్యులు అండగా నిలిచారు. పీఎఫ్‌పై వడ్డీరేటును వామపక్షాలు సహా ఇతర ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఉద్యోగులు, కార్మికుల ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌)పై వడ్డీరేటు తగ్గించడాన్ని వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు రాజ్యసభలో తప్పుబట్టాయి. ఈ అంశాన్ని లేవనెత్తడానికి వామపక్షాలు, తృణమూల్‌ ప్రయత్నించాయి. అయితే, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు అందుకు అనుమతివ్వలేదు. పీఎఫ్‌పై చర్చించడానికి ముందుగా నోటీసు ఇవ్వాలని చైర్మన్‌ కోరారు. సభ సమావేశం కాగానే నలుగురు మాజీసభ్యులకు సంతాపం తెలిపింది. అనంతరం సీపీఐ సభ్యుడు వినయ్‌ విశ్వం, కొంతమంది టీఎంసీ సభ్యులు ఉద్యోగుల పీఎఫ్‌పై వడ్డీరేటు తగ్గింపు అంశాన్ని ప్రస్తావించారు. పీఎఫ్‌పై వడ్డీరేటును 8.5శాతం నుంచి 8.1శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనపై చర్చించాలని వినయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి వెంకయ్యనాయుడు అనుమతివ్వలేదు. దీనిపై ముందుగా తనకు నోటీసు ఇవ్వాలని సూచించారు. మాజీ సభ్యులు నవీన్‌ చంద్ర బుర్గోహన్‌, రాహుల్‌ బజాజ్‌, డీపీ ఛటోపాధ్యాయ, యడ్లపాటి వెంకటరావు మృతికి సభ కొద్దిసేపు మౌనం పాటించింది.
పీఎఫ్‌పై వడ్డీరేటు తగ్గించిన ప్రభుత్వంపై డీఎంకే సభ్యులు టీఆర్‌ బాలు లోక్‌సభలో ఆగ్రహం వెలిబుచ్చారు. ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.5శాతం వడ్డీరేటును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈపీఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.1000 పెన్షన్‌ మాత్రమే చెల్లిస్తుందని బాలు తెలిపారు. ఇదే అవమానకరమనుకుంటే పుండుపై కారం చల్లిన మాదిరిగా ఈపీఎఫ్‌పై వడ్డీరేటును 8.5శాతం నుంచి 8.1శాతానికి ఈపీఎఫ్‌ఓ తగ్గించిందని బాలు విమర్శించారు. ఇది అత్యంత ప్రమాదకర చర్య అని మండిపడ్డారు. ఇది సరైన నిర్ణయం కాదని, 8.5శాతం వడ్డీ ఉండాలని, నెలవారీ పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ తగ్గించడాన్ని తృణమూల్‌ సభ్యులు సౌగతారాయ్‌ తప్పుబట్టారు. మోదీ సర్కారు ప్రైవేటీకరణ విధానంపై ఆందోళన వెలిబుచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img