Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దేశ ద్రోహం చట్టంపై 5న తుది విచారణ

వారంలోగా స్పందన తెలపాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం

న్యూదిల్లీ : దేశద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై తుది విచారణ మే 5న జరుగుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తెలిపింది. వారం చివరిలోగా తమ స్పందనను దాఖలు చేయాలని బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఐపీసీలోని సెక్షన్‌ 124(ఎ) (దేశద్రోహం) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై తుది విచారణను మే 5న ప్రారంభిస్తామని, వాయిదా కోసం ఎలాంటి అభ్యర్థనను స్వీకరించబోమని పేర్కొంది. ‘ఈ వారం చివరిలోగా సమాధానం ఇవ్వాలని మేము కేంద్రాన్ని ఆదేశిస్తున్నాం. అఫిడవిట్‌కు మంగళవారంలోగా సమాధానం ఇవ్వాలి. మే 5న ఎలాంటి వాయిదా లేకుండా తుది పరిష్కారానికి సంబంధించిన అంశాన్ని జాబితా చేయండి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో పిటిషనర్‌ తరపు వాదనలకు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ నేతృత్వం వహిస్తారని కూడా అత్యున్నత న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ సందర్భంగా, సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ పారిఖ్‌ మాట్లాడుతూ, పీయూసీఎల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ జాబితా చేయలేదని తెలిపారు. అప్పుడు సమస్యను ధర్మాసనం పరిష్కరించాలనుకుంటున్నారా లేదా అన్ని పిటిషన్లను జాబితా చేయాలనుకుంటున్నారా? మీరు ఆలస్యం చేయాలనుకుంటే, అది మీపై ఆధారపడి ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. కాగా దేశద్రోహంపై వలస రాజ్యాల కాలం నాటి శిక్షా చట్టాన్ని అపారంగా దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయడానికి మహాత్మా గాంధీ వంటి వ్యక్తులను నిశ్శబ్దం చేయడానికి బ్రిటిష్‌ వారు ఉపయోగించిన నిబంధనను ఎందుకు రద్దు చేయడం లేదని సుప్రీం కోర్టు గత ఏడాది జులైలో కేంద్రాన్ని ప్రశ్నించింది. అయితే బుధవారం విచారణ సందర్భంగా.. సెక్షన్‌ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ ప్రభుత్వం రాతపూర్వక సమాధానానికి సిద్ధంగా ఉందని, అవసరమైన దిద్దుబాట్లు చేసిన తర్వాత రెండు రోజుల్లో దాఖలు చేస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం… వారం చివరిలోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి గడువు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img