Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జగన్‌ మూడేళ్ల పాలన అప్పుల మయం

రాష్ట్రంలో అభివృద్ధి ఏదీ?
సీఎం దావోస్‌ పర్యటన తుస్‌
పేరుకే సామాజిక న్యాయం… మంత్రులంతా డమ్మీలే
అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
త్వరలో ఆర్థిక, మేధావులతో సమావేశం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మూడేళ్ల జగన్‌ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అప్పులమయమైందని, బెత్తెడు అభివృద్ధి అయినా జరిగిందా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నిలదీశారు. విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమా వేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ జగన్‌ మూడేళ్ల పాలనపై వైసీపీ నేతలు మాత్రమే సంబరాలు జరుపుకున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవంగా జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగితే, వారంతా ముందుకు వచ్చి సంబరాలు నిర్వహించే వారని, అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదని అన్నారు. మూడేళ్లలో జగన్‌ ప్రభుత్వం అడుగడుగునా ప్రజలపై భారాలు వేసిందేగానీ, ఎక్కడా అభివృద్ధిపై మక్కువ చూప లేదని వివరించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలో పెట్రోలు, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయ న్నారు. రోజువారీ వడ్డీల కంటే అధికంగా ప్రజలపై జగన్‌ భారాలు మోపుతున్నారని విమర్శించారు. అటు సంక్షేమ పథకాల ముసుగులో జగన్‌ ప్రజల ఖాతాల్లో లక్షా 42 వేల కోట్లు వేశానని గొప్పలు చెప్పుకుంటూ, ఇటు నిత్యవసర ధరలు, చెత్త, ఆస్తి పన్నుల భారాలు, ఆర్టీసీ బస్సు, విద్యుత్‌ చార్జీల పేరిట భారీగా ప్రజా దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్లలో కనీసం ఏ రంగంలోనైనా అభివృద్ధి జరి గిందా?, ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అంటూ సూటిగా నిలదీశారు. పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి అమరావతిలో 40 వేల మంది కార్మికులు పని చేస్తుండగా, జగన్‌ వారిని తరిమే శారని అన్నారు. అక్కడ కేవలం వాచ్‌మెన్లే అలంకార ప్రాయంగా మిగిలారన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా విచ్ఛిన్నమైందని, పోలవరం ప్రాజెక్టు పనులను పక్కన పెట్టేశారని, కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో జగన్‌ సర్కారు విఫలమైందని విమర్శించారు. పోలవరం నిర్వాసి తులను పట్టించుకోవడం మానేశారన్నారు. నాడు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్‌, నేడు ఎందుకు మౌనంగా ఉండిపోయారనీ, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేం ద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదంటూ ధ్వజమెత్తారు. కడప స్టీలు ఫ్యాక్టరీ రాకపోగా, ఉన్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేట్‌ పరం చేస్తుంటే, జగన్‌ కేంద్రంతో ఎం దుకు సంప్రదింపులు చేయలేకపోయారన్నారు. జగన్‌ హయాంలో ఏపీకి ఒక్క పరిశ్రమా రాలేదనీ, ఒక్క రం గంలో కూడా వీసమంత అభివృద్ధి లేదన్నారు. దావోస్‌లో పెట్టుబడిదారులు కేటీఆర్‌ని కలిశారేగానీ, జగన్‌ దగ్గరికి రాలేదని తెలిపారు. పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి జగన్‌ చెప్పుకోవడానికి ఏమి లేక బస్సు యాత్రలు చేయి స్తున్నారని ధ్వజమెత్తారు. బస్సు యాత్ర చేసిన మంత్రు లంతా డమ్మీలనీ, ఆ మంత్రులంతా వారికి అధికారం ఉందో, లేదో గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. బస్సు యాత్రలో మంత్రులంతా జగన్‌ను అభినవ పూలే, అంబేద్కర్‌గా పోల్చడం తగదన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పేరుకే సామాజిక న్యాయమని మండిపడ్డారు. వైసీపీలో అధికారం కేవలం నలుగురి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డిలకి మాత్రమే ఉందని, ఇదేనా సామాజిక న్యాయమంటూ ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయని, శవాన్ని డోర్‌ డెలివరీ చేశారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును ఒక జిల్లాకు ఆలస్యంగా పెట్టి, అక్కడ కులాల మధ్య చిచ్చుకు ప్రభుత్వమే కారణమైందని తప్పుపట్టారు. ఇతర జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడు రాని అభ్యంతరాలు, అంబేద్కర్‌ పేరు పెట్టినందుకు వచ్చాయా?, కావాలనే నెల రోజులు అభ్యంతరాలు పేరిట అక్కడ కులాల మధ్య జగన్‌ మంట పెట్టారని రామకృష్ణ తెలిపారు. కడప జిల్లా వాసులంతా ఏళ్ల తరబడి జగన్‌ కుటుంబానికి ఓట్లు వేసి గెలిపిస్తున్నందుకుగాను అక్కడ కడప పేరు లేకుండా చేశారన్నారు. మూడేళ్ల జగన్‌ పాలనలో అభివృద్ధి లేదుగానీ, అప్పులు మాత్రం విపరీతంగా చేశారని విమర్శించారు. ఇప్పటివరకు 8 లక్షల కోట్లకు అప్పులు చేరాయని, మరో రెండేళ్లలో రూ.10 లక్షల కోట్లకు చేరనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలోను, గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల దగ్గర నుంచీ, ప్రస్తుత జగన్‌ మూడేళ్ల పాలనలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అఖిలపక్ష పార్టీలు, ఆర్థిక నిపుణులు, మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img