Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రయాణం మరింత భారం!

ఎం. కోటేశ్వరరావు

ఆర్‌టీసీలో వివిధ సర్వీసుల మీద పెంచిన డీసెల్‌ భారం వెనుక పాలక పార్టీ పెద్దలు`ప్రైవేటు బస్‌ యజమానుల కుమ్మక్కును కొట్టి పారవేయలేం. వారు విడిగా తక్కువ ధరలకు బంకుల్లో డీసెలు కొనుగోలు చేస్తారు కనుక ఆర్‌టీసీ పెంచిన మొత్తం ఎంతైతే అంత వారికి వచ్చేది అదనపు లాభమే. డిమాండ్‌ ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో ఇప్పటికే ఆర్టీసీ కంటే తక్కువ చార్జీలకే తిప్పుతున్నారు. అందువలన ఇప్పుడు ఆర్‌టీసీలో పెంపుదల వారికి మరింత లాభంగా ఉంటుంది. దానిలో కొంత తగ్గించుకొని ఆర్టీసి కంటే తక్కువ చార్జీలకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్‌టీసీలో ఎక్కేవారు తగ్గుతున్నారు. లాభం వుండే దూరపు సర్వీసుల్లో మరింతగా తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందువలన ఏ విధంగా చూసినా సంస్థను మరింత దెబ్బతీసే పనే తప్ప మరొకటి కాదు.

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి) డీసెల్‌ సెస్‌ పేరుతో ప్రయాణీకుల మీద భారం మోపింది. ఈ జూలై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సంస్థ చేసిన ప్రకటనలో ‘‘పొరుగు రాష్ట్రంలో అన్ని బస్సుల టిక్కెట్లు, పాస్‌ల ధరలు 9.6.2022 నుంచి పెంచారు’’ అని ప్రభుత్వం సమర్థించుకుంది. ఎదుటివారు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటామా అన్న లోకోక్తి తెలిసిందే. భారం మోపేందుకు ఇది సాకు తప్ప హేతుబద్దత లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాటన్నిం టినీ ఆంధ్రప్రదేశ్‌ అమలు జరుపుతున్నదా, ఎపిలో ఉన్న వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా! ఒకరు పెంచితే మిగతావారు పెంచాలని, తగ్గిస్తే తగ్గించాలనే ఒప్పందం గానీ, విధిగానీ లేదు. జూలై రెండవ తేదీన ఇరుగు పొరుగు రాష్ట్రాలలో లీటరు పెట్రోలు, డీసెలు ధరలు ఇవీ.
పట్టణం పెట్రోలు డీసెలు
విజయవాడ 111.66 99.43
హైదరాబాదు 109.66 97.82
బెంగళూరు 101.94 87.89
చెన్నై 102.63 94.24
భువనేశ్వర్‌ 103.19 95.28
ఆర్‌టీసీ ఛార్జీల పెంపుదల కోసం పొరుగు రాష్ట్రంతో పోలిక తెచ్చిన జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ ఈ రేట్లను గమనించి తక్కువ ఎక్కడుందో దాన్ని ఎందుకు అనుసరించటం లేదు? దున్నబోతే దూడల్లో తినబోతే ఎద్దుల్లో అంటే ఇదే కదా! అడ్డగోలు సమర్థనకు ఒక తర్కంపద్ధతీ పాడూ ఉండదు. ఆర్‌టీసీ ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా సర్వీసులను నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు పొరుగునే తక్కువగా ఉన్న ధరలకు డీసెలు, పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎపిఎస్‌ఆర్‌టీసీ ఛార్జీలు తక్కువగా ఉంటే పొరుగు రాష్ట్రాల జనాలు మన బస్సులు ఎక్కుతారు, రాబడి కూడా పెరుగు తుంది కదా! సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ తిష్ట వేసిన సలహాదారులకు, అధికారులకు ఈ చిన్న అంశం తట్టలేదా! గతంలో కూడా డీసెలు ధరలు పెరిగాయి. ఎన్నడూ ఆర్‌టీసీ చరిత్రలో దొడ్డిదారిన డీసెల్‌ సెస్‌ పేరుతో భారం మోపలేదు. నవరత్నాలలో భాగంగా మూడు సంవత్సరాలలో లక్షా 50వేల కోట్ల వరకు జనానికి లబ్ధి చేకూర్చినట్లు వైసీపీ ప్రభుత్వ విజయాలలో చెప్పుకుంటు న్నారు. ఆర్‌టీసీ అధికారికంగా వెల్లడిరచిన సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వరుసగా వచ్చినట్లు చెప్పిన నష్టం 201920లో రూ. 1,222.96 కోట్లు, 202021లో రూ.2,982.32 కోట్లు, 202122లో రూ.2,698.86 కోట్లు. ఆర్‌టీసీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటిం చారు. ఇది మిగిలిన ప్రభుత్వ శాఖల వంటిది కాగా నష్టాల గురించి ఎందుకు చెబుతున్నారన్నది ప్రశ్న. వైద్య ఆరోగ్యశాఖలో కూడా అందించేది సేవ మాత్రమే. ఆర్‌టీసీలో సిబ్బంది వేతనాలు, బస్సుల కొనుగోలు, నిర్వహణ ఉన్నట్లే అక్కడా సిబ్బంది వేతనాలు, ఆసుపత్రులు, వాటికి అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు వంటివి ఉంటాయి. దానిలో లేని లాభనష్టాల లెక్కలు ఆర్టీసీకి ఎందుకు చెబుతున్నట్లు? ఆసుపత్రుల్లో వాణిజ్య దుకాణాలు ఉండవు, అదే బస్టాండ్లలో ఎంతో కొంత దుకాణాల ద్వారా రాబడి వస్తుంది. ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించేది పేద, మధ్య తరగతి వారు మాత్రమే. వారి కోసం రవాణా సబ్సిడీని కూడా నవరత్నాల్లో భాగంగా పరిగణించి ఏడాదికి మూడువేల కోట్ల రూపాయల భారాన్ని భరించే శక్తి లేనిదిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? నిజానికి నష్టం అని చెబుతున్నదంతా నష్టం కాదు. వృద్ధులు, స్కూలు విద్యార్థులు, బస్‌పాస్‌లు, ఆర్‌టీసీ మాజీ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతరులకు ఇస్తున్న రాయితీలు కూడా దీనిలో ఉన్నందున ఆ మేరకు ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తే నష్టాల మొత్తం తగ్గుతుంది. గత మూడు సంవ త్సరాల్లో డీసెలు ధర లీటరుకు రూ.40 పెరిగిందని ఆర్‌టీసీ తన ప్రకటనలో చెప్పింది. డీసెలు మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 22.25 శాతం పన్ను విధిస్తున్నది అంటే అంతమేర రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తున్నదనేది పచ్చి నిజం. ఆ మేరకు ఆర్‌టీసీ కొనుగోలు చేసే డీసెలు మీద పన్ను తగ్గించినా భారం తగ్గుతుంది కదా!
పెద్ద మొత్తంలో డీసెలు కొనుగోలు చేసేవారికి లీటరుకు రూ.30 అదనంగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఇది జనం మీద విధిస్తున్న మోదీ టాక్సు అని చెప్పవచ్చు. తెలంగాణా వంటి చోట్ల ఆర్‌టీసీ ఏకమొత్త కొనుగోలు నిలిపివేసి ఆ భారాన్ని తగ్గించుకొనేందుకు విడిగా కొనుగోలు చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టీసీ కూడా అదే పద్ధతిని అనుసరించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు కొనుగోలు నిలిపి వేశారని చెబుతున్నారు. అలాంటపుడు ఆ పేరుతో జనాల మీద భారం మోపారంటే దీన్ని మోదీజగన్‌ టాక్సు అని పిలవాల్సి ఉంటుంది. ఆర్‌టీసీ బస్సుల్లో ఇప్పటికే టోలు, పాసింజరు, సేఫ్టీ పేరుతో అదనపు మొత్తాలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది అదనపు భారం. ఆర్‌టీసీలో వివిధ సర్వీసుల మీద పెంచిన డీసెల్‌ భారం వెనుక పాలక పార్టీ పెద్దలుప్రైవేటు బస్‌ యజమానుల కుమ్మక్కును కొట్టి పారవేయలేం. వారు విడిగా తక్కువ ధరలకు బంకుల్లో డీసెలు కొనుగోలు చేస్తారు కనుక ఆర్‌టీసీ పెంచిన మొత్తం ఎంతైతే అంత వారికి వచ్చేది అదనపు లాభమే. డిమాండ్‌ ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో ఇప్పటికే ఆర్టీసీ కంటే తక్కువ చార్జీలకే తిప్పుతున్నారు. అందువలన ఇప్పుడు ఆర్‌టీసీలో పెంపుదల వారికి మరింత లాభంగా ఉంటుంది. దానిలో కొంత తగ్గించుకొని ఆర్టీసి కంటే తక్కువ చార్జీలకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్‌టీసీలో ఎక్కేవారు తగ్గుతున్నారు. లాభం వుండే దూరపు సర్వీసుల్లో మరింతగా తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందువలన ఏ విధంగా చూసినా సంస్థను మరింత దెబ్బతీసే పనే తప్ప మరొకటి కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img