Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఆరోగ్యకర ఆహారం.. ప్రపంచం..

జి20 దేశాలకు ఎఫ్‌ఏఓ పిలుపు
పెట్టుబడులు పెంచాలని ప్రతిపాదన

ఐక్యరాజ్య సమితి : ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు ఆహారం, స్థిరమైన జీవనం కోసం పెట్టుబడులను పెంచాలని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) అధిపతి జి20 పర్యావరణ మంత్రులకు పిలుపునిచ్చారు. జి20 పర్యావరణ దేశాల మంత్రుల రెండు రోజుల సమావేశంలో భాగంగా ఎఫ్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌ క్యూ డోంగ్యూ ఈ ప్రతిపాదన చేశారు. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలపై వాతావరణ సంక్షోభం, కొవిడ్‌ మహమ్మారి ప్రభావం ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న విపరీత పరిణామాలుగా క్యూ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికిగాను మనకు ఆరోగ్యకరమైన వాతావరణం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లమందికి పైగా ప్రజలు నీటి కొరతతో తీవ్రంగా అల్లాడుతున్నారని, కోట్లాది ఎకరాల వర్షాధార భూములు బీడుభూములుగా మారాయని, 60 శాతం సాగునీటి పంట భూములు అధికనీటి ఒత్తిడికి లోనయ్యాయని పేర్కొన్నారు. ప్రభావవంతమైన పాలనా యంత్రాంగం, డిజిటల్‌ ఆవిష్కరణలు, మెరుగైన పర్యవేక్షణ, పెట్టుబడుల ద్వారా నీటి సంబంధిత సవాళ్లను అధిగమించవచ్చునని క్యూ సూచించారు. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన అహారానికి స్థిరమైన వాతావరణంతోపాటు పెట్టుబడులను పెంచాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చారు. ప్రోత్సాహకాలు, పెట్టుబడులతో సహా జీవవైవిధ్యానికి అనుకూలమైన విధానాలను ప్రోత్సహించాలని క్యు ప్రతిపాదించారు. అటవీ నిర్మూలనను అరికట్టడం, వాతావరణ మార్పుల తగ్గింపునకు, జంతువుల నుంచి మానవులకు వ్యాధుల రాకుండా నిరోధించేందుకు ధనిక దేశాలు తమవంతు సహకారించాలని క్యూ నొక్కి చెప్పారు. జీవవైవిధ్యం, భూ క్షీణత నియంత్రణ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సంవత్సరానికి 41.4 ట్రిలియన్లు అవుతాయని అన్నారు. ఎఫ్‌ఏఓ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం దశాబ్దాల కాలంగా చేపట్టిన పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా జీవవైవిధ్య నియంత్రణకు తక్షణ చర్యలు అమలుకు అధ్భుతమైన అవకాశాన్ని కల్పించిందని క్యూ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడానికి, వ్యవసాయ-ఆహార వ్యవస్థల స్థిరమైన అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img