Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి

ఎగువ గ్రామాల్లోకి వరద నీరు
19 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు


వరద గోదావరి పోటెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో గోదావరి వరద నీటితో ఉరకలేస్తోంది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద నీరు వెనక్కు ఎగదన్నడంతో ప్రాజెక్టు ఎగువన ఉన్న గ్రామాలలోకి వరద నీరు చేరుకుంది. ఆయా గ్రామాల ప్రజలు సమీపంలో ఉన్న కొండల మీదకు వెళ్లి శిబిరాలు వేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుండి స్పిల్‌ ఛానల్‌ మీదుగా గోదావరి ఉరకలెత్తుతోంది. వరద పరిస్థితి చూస్తే మరింతగా పెరిగిపోయే సూచనలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అధికార బృందాలు ముంపు బారిన పడిన గ్రామాల ప్రజలను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు ప్రాజెక్టు బాధిత గ్రామాల ప్రజలకు నిత్యావసరాలను అందచేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గినప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి వరద నీటిమట్టం కూనవరం వద్ద 19.26 మీటర్లుగా, పోలవరం వద్ద 19.46 మీటర్లుగా నమోదయింది. ఈ నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. భద్రాచలం నుండి వచ్చే వరద నీటికి శబరి నది వరద నీరు కూడా కలవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో అనేక గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. పోలవరం మండలంలో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిమట్టం ఇంచుమించుగా హైటెన్షన్‌ విద్యుత్‌ స్థంభాలను ముంచి వేసింది. వరద నీరు కొత్తూరు, కోండ్రుకోట, మాదాపురం, వాడపల్లి, టేకూరు, తల్లవరం, తూటుగుంట, సివగిరి, సిరివాక తదితర ఏజెన్సీ గ్రామాలను ముంచెత్తింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. జాయింట్‌ కలెక్టర్‌ హిమాంశు శుక్లా పోలవరంలో మకాం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువనున్న వాడపల్లి, తూటిగుంట, శివగిరి, కొరుటూరు, శిరివాక గ్రామాలలో ముంపు బాధితులకు సరఫరా చేయడానికి వాటర్‌ ప్యాకెట్ల బస్తాలు, దోమల కాయిల్స్‌, కూరగాయలు, కిరాణా సరుకులను ప్రత్యేక లాంచీపై సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహసిల్దార్‌ దుర్గామహాలక్ష్మి అధ్వర్యంలో స్థానిక రేషన్‌ డీలర్లు, రెవెన్యూ సిబ్బందిని పంపించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img