Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అభివృద్ధిలో కాకినాడను అగ్రగామిగా చేస్తాం

సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
రూ.6.26 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
హాజరైన మేయర్, కమిషనర్, కౌడ ఛైర్‌పర్సన్

కాకినాడను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. రూ.6.26 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గురువారం శంఖుస్థాపనలు చేశారు. మేయర్‌ సుంకర శివప్రసన్నసాగర్, కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, కమిషనర్‌ కె.రమేష్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమంపై దృష్టిసారించారని, అభివృద్ధి విషయాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించారన్నారు. ఆ మేరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో మౌళిక వసతులు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడలో ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ తగ్గిన గంట వ్యవధిలో నీరంతా తొలగిపోయే పటిష్టమైన ప్రణాళికతతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చామన్నారు. మేయర్‌ సుంకర శివప్రసన్నసాగర్‌ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంపట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడంఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నాడు–నేడు పథకం ద్వారా చేసిన అభివృద్ధి పనులను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు. కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్‌ మాట్లాడుతూ మున్నెన్నడూ జరగనంత అభివృద్ధి గడచిన మూడేళ్ళలో కాకినాడలో జరిగిందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ మాట్లాడుతూ ప్రతిపాదిత అభివృద్ధి పనులన్నింటిని నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మీసాల ఉదయ్‌కుమార్, చోడిపల్లి సత్యప్రసాద్, నగరపాలక సంస్థ ఎస్‌ఈ సత్యకుమారి, స్మార్ట్‌సిటీ ఎస్‌ఈ వెంకట్రావు, కార్పొరేటర్లు రోకళ్ళసత్యనారాయణ, గోడి సత్యవతి, నల్లబెల్లి సుజాత, కర్రి శైలజ, వాసిరెడ్డి రాంబాబు, రాజాన మంగారత్నం, గుజ్జు దుర్గ, మల్లిపూడి సూర్యదీపిక తదితరులు పాల్గొన్నారు.

రూ.6.26 కోట్ల అభివృద్ధి పనులివే…
– రూ. 49.50 లక్షలతో కాకినాడ 32, 33 డివిజన్లకు సంబంధించి ఆర్‌సీసీ డ్రైన్లు, ఆనందభారతి సెంటర్‌ నుంచి రామకృష్ణారావుపేట గాంధీబొమ్మ సెంటర్‌ వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు

– రూ.1.50కోట్లతో రాఘవేంద్రస్వామి గుడి నుంచి రామాలయం వీధి వరకు,వైఎస్‌ఆర్‌ బ్రిడ్జి నుంచి రైల్వే ట్రాక్‌ గోడ, సీసీ డ్రైన్లు, కొత్తపేట చిన్నమసీదు నుంచి భారతమాత బొమ్మ వరకు ఇతర అభివృద్ధి పనులు.

– రూ. 27లక్షలతో 39వ డివిజన్‌లో కింతాడ వెంకట్రావు కమ్యూనిటీ హాలు ప్రారంభం
– రూ.2 కోట్ల వ్యయంతో 41వ డివిజన్‌ రామారావుపేటలో అదనపు కమిషనర్‌ క్వార్టర్స్‌ నిర్మాణం. అదే ప్రాంతంలో మరో రూ.2 కోట్లతో అత్యాధునిక హంగులతో కమ్యూనిటీహాలు నిర్మాణానికి శంఖుస్థాపన

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img