Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఎర్ర జెండా నీడన…

నేటి నుంచి విశాఖలో సీపీఐ రాష్ట్ర మహాసభలు

. గాంధీ విగ్రహం నుంచి భారీ ప్రదర్శన
. గురజాడ కళాక్షేత్రం వద్ద బహిరంగ సభ
. హాజరుకానున్న అగ్రనేతలు

విశాలాంధ్ర బ్యూరో` విశాఖపట్నం : భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర 27వ మహాసభలకు విశాఖనగరం ముస్తాబైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ మహాసభలకు అన్నిరకాల ఏర్పాట్లను ఆహ్వాన సంఘం పూర్తి చేసింది. మహాసభల ను పురస్కరించుకుని నగరమంతటా పార్టీ పతాకాలు, హోర్డింగ్‌లు, వాల్‌ రైటింగ్స్‌, ముఖ్య కూడలి కేంద్రాలన్నీ తోరణాల అలంకరణతో నగరం ఎరుపుమయంగా మారి పండుగ వాతావరణం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా నగరమంతటా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, ప్లెక్సీలు చూపరులను ఆకర్షిస్తు న్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో 13వ మహాసభలకు ఈ నగరం వేదిక అయింది. దాదాపు 48 సంవత్సరాల తర్వాత విశాఖలో తిరిగి సీపీఐ రాష్ట్ర మహాసభలు ఈ ఏడాది జరుగుతుండడంతో, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు దీనిని తమకు వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తూ మహాసభల విజయవంతానికి రేయంబవళ్ళూ శ్రమిస్తున్నారు. తొలిరోజు ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ జరుగనున్నాయి. 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి బహిరంగసభ వేదిక సిరిపురం గురజాడ కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన జరుగుతుంది. దీనికి అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలింపుకు నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం 27, 28 తేదీల్లో అక్కడకు సమీపంలోని వీఎంఆర్‌డీఏ చిల్ట్రన్స్‌ ఎరీనా సమావేశ మందిరంలో ప్రతినిధుల సభలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన సీపీఐ, అనుబంధ సంఘాలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ సుమారు 600 మంది ప్రతినిధులు హాజరవుతారు. వీరందరికీ నగరంలో భోజన, వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఏజే స్టాలిన్‌, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మహాసభల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే దూర ప్రాంతాలకు చెందిన కమ్యూనిస్టు శ్రేణులు నగరానికి చేరుకున్నాయి. ఒకరోజు ముందుగానే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తిలు ప్రతినిధులుగా పేర్లు నమోదు చేసుకున్నారు.
సభాస్థలిని, ప్రతినిధుల సమావేశ మందిరాన్ని పరిశీలించిన రామకృష్ణ
విశాఖ నగరానికి గురువారం చేరుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, విశాఖ నగర నేతలు, ఆహ్వానసంఘ సభ్యులతో కల్సి బహిరంగ సభ జరిగే సభా ప్రాంగణాన్ని, ప్రతినిధుల సమావేశ మందిరాలను పరిశీలించారు. విశాలమైన వేదికను, వర్షం వచ్చినా బహిరంగ సభ నిర్వహణకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు చేసిన ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లను చూసి రామకృష్ణ అభినందించారు. బహిరంగ సభా స్థలానికి అమరజీవి, ప్రముఖ రైతు నేత కొల్లి నాగేశ్వరరావు పేరును, ప్రతినిధుల సమావేశ మందిరానికి కార్మికోద్యమ నేత అమరజీవి గురుదాస్‌ దాస్‌ గుప్తా , భోజన శాలకు వంక సత్యనారాయణ పేర్లు పెట్టారు. బహిరంగసభకు ముఖ్యఅతిథిగా సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా హాజరవుతున్నారు. అలాగే వక్తలుగా జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, జాతీయ కార్యవర్గసభ్యులు అనీ రాజా, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు మానం ఆంజనేయులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, ప్రముఖ సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొంటున్నారు.
సీఎం రాకతో పోలీసుల ఆంక్షలు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం విశాఖ నగర పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సీపీఐ ఏర్పాట్లకు అడుగడుగునా ఆటంకాలు కల్గించే ప్రయత్నం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జెండాలు, తోరణాలు ప్లాస్టిక్‌కు బదులుగా ఈసారి మొత్తం గుడ్డతో కుట్టించినవి తెప్పించారు. వీటిని నగరంలోని ముఖ్య కూడలి కేంద్రాల్లో అలంకరించగా , జీవీఎంసీ సిబ్బంది సీఎం పర్యటన పేరుతో తీసేయడం పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img