Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రూపాంతర అనుసరణ వ్యవసాయం

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

పర్యావరణ మార్పుల మూలకారణాల నిర్మూలన మన చేతుల్లో లేదు. సామ్రాజ్యవాద దేశాల కబంధ హస్తాల్లో బందీగా ఉంది. అందుకే మనం ఉపశమన పద్ధతులు పాటించాలి. ఇవి వాతావరణ మార్పు నష్టాలను కొంతమేరకు తగ్గించగలవు. పెరిగిన భూతాప నేపథ్యంలో ఆహారభద్రత కోసం వ్యవసాయంలో రూపాంతర అనుసరణ తప్పనిసరి. ఒక వ్యవస్థలో విస్తృత మార్పులను రూపాంతర అనుసరణ అంటారు. వ్యవసాయంలో ఈ ప్రక్రియను వ్యవసాయ రూపాంతర అనుసరణ అంటారు.
ఐక్యరాజ్యసమితి ‘ఆహార వ్యవసాయ సంస్థ’ నివేదిక ప్రకారం, వాతావరణ మార్పుల కారణంగా 69 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. వాతావరణ మార్పు వలన దారిద్య్రరేఖ దిగువకు వెళ్ళిపోయిన 10 కోట్ల మందిలో రైతులు, పశువుల కాపరులు, గ్రామీణ ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. వాతావరణ మార్పు ప్రపంచ ఆహార వ్యవస్థలను బలహీనపరుస్తోంది, ఆకలిని పెంచుతోంది. లక్షలాది రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తోంది. సాగు నీటి వసతులు తగ్గి అనేక పంట భూములు బీళ్ళుగా మారాయి. ఈ భూముల్లో కేవలం తగ్గిన వర్షపాతంతోనే పెరగగల వ్యవసాయ వనాలు పెంచవచ్చు. తక్కువ నీటితో పండే పంటలు పండిరచవచ్చు. చైనా రైతులు అధిక మోతాదులో పంటల బీమాలు తీసుకున్నారు. ఐరోపా దేశాల్లో తీర ప్రాంతాల మొక్కలు పర్వత ప్రాంతాలకు చేరాయి. ప్రపంచ వ్యాపితంగా మొక్కలు మొలకెత్తే, పుష్పించే రుతువులను మార్చుకున్నాయి. పక్షులు వాతావరణ అనుకూల ప్రదేశాలకు తాత్కాలికంగా వలస పోతాయి. ప్రకృతి విపత్తులు, కరవుల వలన 2030 నాటికి చైనా ప్రధాన ఆహార పంటలయిన వరి, గోధుమ, మొక్క జొన్నల దిగుబడి 8% తగ్గుతుందని అంచనా. పెరుగుతున్న భూతాపంలో వ్యవసాయం వృద్ధి చెందదు. అతి ఉష్ణ ప్రదేశాలు, తీర ప్రాంతాలు, పాక్షిక సారహీన వేడి ప్రాంతాలు, పూర్తి సారహీన వేడి ప్రాంతాలు, గడ్డకట్టే నదీపరివాహక ప్రదేశాలు, మంచు కొండల ప్రాంతాలలో వ్యవసాయం అసలు కుదరదు. ఈ ప్రదేశాలలో వ్యవసాయ మనుగడ కోసం, మానవాళి ఆకలి తీర్చడానికి వ్యవసాయ వ్యవస్థలు రూపాంతరం చెందాలి.
లాభాపేక్షలేని ప్రపంచ పరిశోధన సంస్థ ‘ప్రపంచ వనరుల సంస్థ’ పరిశోధనలు, విశ్లేషణలు, భాగస్వామ్య విధానాలతో పర్యావరణ మార్పులో వ్యవసాయ స్థిరత్వ పద్ధతులు తెలియచేస్తోంది. 2050కి ప్రపంచ ఆహార అవసరాలు 50% పెరుగుతాయని, వ్యవసాయ ఉత్పత్తులు 30% తగ్గుతాయని, పర్యావరణ మార్పుకు అనుగుణంగా తమ పరిస్థితులను మార్చుకోలేని జనాభా 100 కోట్లకు చేరుతుందని ఈ సంస్థ అంచనా. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 30 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. పర్యావరణ మార్పు వల్ల వీరికి నష్టాలు ఎక్కువ. వ్యవసాయ పరికరాల, ముడి సరుకుల, సాంకేతిక పరిజ్ఞాన, ఆర్థిక వనరులు వీరికి అందుబాటులో లేవు. ప్రపంచ వనరుల సంస్థ తన నివేదికలో ఆహార వ్యవస్థలు అపాయంలో ఉన్నాయంది. దీర్ఘకాల సుస్థిర ఆహార భద్రతకు వ్యవసాయంలో రూపాంతర అనుసరణ అవసరాన్ని నొక్కి చెప్పింది. కరువు-నిరోధక రకాల పంటలతో, నీటిపారుదల మార్గాలతో పంటల దిగుబడిని పెంచవచ్చు. వాతావరణ మార్పులకు, వాటి ప్రభావాలకు ప్రతిస్పందనగా వ్యవసాయ వ్యవస్థల ప్రాథమిక లక్షణాలను మార్చాలని రూపాంతర అనుసరణ వ్యవసాయం నిర్ధేశిస్తుంది. ఆ వ్యవసాయంలో మూడు కీలక చర్యలను గమనిద్దాం. మొదటిది- నిర్ధిష్ట రకాల పంటల, పశువుల ఉత్పత్తి కేంద్రాల, ప్రజల వినియోగానికి అనుకూలంగా మార్చే కార్ఖానాల, సంతల భౌగోళిక ప్రదేశాలను మార్చడం. ఉదాహరణకు, కాఫీ తోటలకు అననుకూలంగా వేడిగా మారుతున్న వర్షాభావ మధ్య అమెరికా దేశం కోస్టారికా కాఫీ రైతులు కాఫీకి బదులుగా నిమ్మ జాతి పండ్ల తోటలు పెంచుతున్నారు. మిట్టపల్లాల తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా గోధుమ, టెఫ్‌ (ఆఫ్రికా తృణ ధాన్యాలు) వంటి ప్రధాన పంటల సాగు ఎత్తయిన శీతల ప్రదేశాలకు మారింది. రైతులు కాఫీ, టెఫ్‌ స్థానంలో మొక్కజొన్న విస్తృతంగా పండిస్తున్నారు.
మారుతున్న పర్యావరణ వ్యవస్థ, తగ్గిన నీటి వసతి, సాగు భూములకు అనుకూలంగా వ్యవసాయ ఉత్పత్తి అనుసంధానం రూపాంతర అనుసరణ రెండవ అంశం. ఉదాహరణకు చైనాలో లవణక్షార (సెలైన్‌-ఆల్కలీ) లక్షణాలను భరించే సముద్రనీటి వరిని అభివృద్ధి చేశారు. భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుతున్న, భారీ ఉప్పు సాంద్రత గల సముద్ర ప్రాంతాల్లో ఇది ఉపయోగకరం. సముద్రనీటి వరికి లోతైన వేర్లుంటాయి. మొక్కలు పొడవుగా పెరుగుతాయి. నీటి ప్రవాహానికి కొట్టుకుపోదు. నీటి మట్టం పెరుగుతున్న సముద్రపు నీటిలో మునగదు. మునిగినా ఆటుపోట్లు తగ్గగానే పైకిలేచి పెరుగుతుంది. దుబాయ్‌ ఎడారులలో పెంచిన ఈ వరిని చైనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వ్యవసాయ నిపుణులు 2019 జూన్‌లో పరిశీలించారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడిని గమనించారు.
నిర్ధిష్ట ప్రాంతంలో ఉత్పత్తి చేసి, వినియోగ అనుకూలంగా వ్యవసాయ ఉత్పత్తులను మార్చే కొత్త పద్ధతులను, సాంకేతికతలను కొత్త ప్రాంతాలకు అనువర్తించడం రూపాంతర అనుసరణ మూడవ అంశం. ఉదాహరణకు ఇండియాలో కొన్ని ప్రాంతాల కూరగాయల రైతులు తమ ఉత్పత్తులను తీవ్ర తుఫానుల నుండి రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో వృక్ష సంరక్షణశాలలను (పాలిహౌస్‌- ప్లాస్టిక్‌ గ్రీన్‌ హౌస్‌) ఉపయోగిస్తున్నారు. ఇవి విస్తృత స్థాయిలో కూరగాయల ఉత్పత్తికి, నీటి వనరుల సంరక్షణకు వీలు కల్పిస్తాయి.
రూపాంతర అనుసరణ వ్యవసాయంలో చైనా విజయవంతమైన ప్రయోగాలు చేసింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనడానికి మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు జరగాలి. సాంకేతిక సమాచారం, భూమి వంటి కీలక వనరులు కలిగిన సంపన్న రైతులే రూపాంతర అనుసరణ వ్యవసాయం చేయగలుగుతున్నారు. పేద రైతులకు అదనపు మద్దతు అవసరం. కొత్త రకాల పంటలు, పశువుల ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక జ్ఞానాన్ని స్థానిక రైతులకు నేర్పడానికి ఎక్కువ పెట్టుబడి కావాలి. ఈ రూపాంతర మార్పుల అమలుకు పేద రైతులను ప్రోత్సహించడానికి మరింత ఆర్థిక వనరులు, విధాన మద్దతు అవసరం. వాతావరణ మార్పుల ప్రభావాలకు ఎక్కువగా గురయ్యే చిన్న, సన్నకారు, దళిత, కౌలు, మహిళా రైతులకు ఈ అవసరాలు ఎక్కువ.
ఆహార వ్యవస్థల్లో రూపాంతర మార్పుల అభివృద్ధికి, రూపాంతర అనుసరణ వ్యవసాయ విధానాల అమలుకు ప్రభుత్వాలు దీర్ఘకాలిక నిధులను, రుణాలను సమకూర్చాలి. రూపాంతర అనుసరణ వ్యవసాయాన్ని పేద రైతులు సొంతంగా చేయలేరు. ఆహార వ్యవస్థలలో రూపాంతర అనుసరణ అనువర్తింపు, విస్తరణలకు ప్రభుత్వాల మద్దతు, ఆర్థిక, పరిశోధనా సంస్థల నుండి తగిన చర్యలు, సహాయ సహకారాలు అవసరం. ఆహార భద్రత పెంపునకు, నష్టాల, అపాయాల, స్థాన మార్పుల ప్రమాదాల తగ్గింపునకు వ్యవస్థలు, రైతులు, వ్యవసాయ కార్మికులు కలిసిమెలిసి పనిచేయాలి.
వ్యాస రచయిత ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం
జాతీయ కార్యదర్శి, 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img