Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సైరస్‌ మిస్త్రీ మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటు: ప్రధాని సంతాపం

డివైడర్‌ను ఢీకొట్టిన మిస్త్రీ కారు
సంతాపం తెలియజేసిన ప్రముఖులు

టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ట్వీట్‌ చేశారు. ‘‘సైరస్‌ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరం. మంచి వ్యాపారవేత్త. ఆయన మరణం వాణిజ్య, పరిశ్రమల ప్రపంచానికి తీరని లోటు. ఆయనకు సంతాపం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే మిస్త్రీ మృతి పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కూడా సంతాపం తెలియజేశారు. ‘‘టాటా సన్స్‌ మాజీ చీఫ్‌ సైరస్‌ మిస్త్రీ మరణం గురించి విని దిగ్భ్రాంతికి గురయ్యాను. అతను విజయవంతమైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. పరిశ్రమలో యువ, ప్రకాశవంతమైన, దూరదృష్టి గల వ్యక్తి. పారిశ్రామిక రంగానికి ఇది తీరని నష్టం… నా హృదయపూర్వక నివాళి ‘‘ అని సీఎం షిండే అన్నారు.
మరోవైపు మిస్త్రీ మృతిపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ‘‘మహారాష్ట్రలోని పాల్ఘర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ దురదృష్టవశాత్తు మరణించిన విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన శాంతించాలి.’’ అని గడ్కరీ ట్వీట్‌ చేశారు. వీరితో పాటు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుప్రియా సూలే కూడా విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా విషాదకరమైన వార్త అని, నా సోదరుడు సైరస్‌ మిస్త్రీ మరణించాడని నమ్మలేకపోతున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
పాల్ఘర్‌లో ప్రమాదం…
మహారాష్ట్రలోని పాల్ఘర్‌ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరస్‌ పి.మిస్త్రీ (54) మరణించారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు నేతృత్వం వహిస్తున్న మిస్త్రీ అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి వెళ్తుండగా చరోటీ సమీపంలో ఆయన కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో నలుగురు వ్యక్తులు ఉండగా.. మిస్త్రీతో సహా ఇద్దరు రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారెవరూ అనేది ఇంకా పోలీసులు గుర్తించలేనట్టు తెలుస్తుంది. సైరస్‌ మిస్త్రీ వ్యాపార దిగ్గజం. వ్య్షాపార రంగంలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img