Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్రామాలలో కానరాని చెత్త సేకరణ

. నిరుపయోగంగా కంపోస్ట్‌ తయారీ కేంద్రాలు
. పనిచేయకున్నా యధావిధిగా జీతాలు
. ప్రభుత్వ లక్ష్యానికి పంచాయతీల తూట్లు


విశాలాంధ్ర`వెల్దుర్తి : పరిసరాల పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపట్టిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పథకం నిరుపయోగంగా మారింది. గ్రామాల్లోని ఇళ్ల నుంచి నేరుగా తడి పొడి చెత్తను సేకరించి దాని ద్వారా కంపోస్ట్‌ను తయారు చేయించి రైతులకు అందుబాటు ధరలలో జీవ ఎరువులను అందించాలని ప్రభుత్వ లక్ష్యం కుంటుపడిపోయింది. ప్రతి గ్రామానికి రెండు చెత్త సేకరించే రిక్షాలతో పాటు, మేజర్‌ పంచాయతీలకు ట్రాక్టర్లను కూడా పంచాయతీలకు అప్పగించడం జరిగింది. చెత్త సేకరణకు సిబ్బందిని కూడా నియమించుకొని వారికి జీతభత్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో సాలిడ్‌ వేస్ట్‌ను కంపోస్ట్‌గా తయారు చేసేందుకు షెడ్లను నిర్మించడం జరిగింది. వాటిలో నేటి వరకు ఒక్క బస్తా కూడా కంపోస్టును తయారుచేసిన పంచాయతీ లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని తయారీ కేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. మరికొన్ని గాలివానలకు నాణ్యతలేమితో పై కప్పులు ఎగిరిపోయి అస్తవ్యస్తంగా మారాయి. ఎటువంటి చెత్త సేకరణ జరగకపోయినప్పటికిని వాటి కోసం నియమించిన ఉద్యోగులకు జీతభత్యాలు వస్తూనే ఉండడం గమనార్హం. వ్యవస్థలను ఏర్పాటు చేయడం కాదు, దాని పనితీరును కూడా అప్పుడప్పుడు గమనించాలనే కనీస పరిజ్ఞానం అధికారులకు లేకపోవడం బాధాకరం. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను సరైన పర్యవేక్షణ చేసి, ప్రజల సొమ్ములను సద్వినియోగం చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందనే విషయం గమనించాలి. ఇప్పటికైనా చెత్తను సక్రమంగా సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితే అంటూ రోగాలు రాకుండా ఉంటాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img