Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అమరావతి కేసు విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ లలిత్‌


ఏపీ రాజధాని ‘అమరావతి’ అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి చీఫ్‌ జస్టిస్‌ లలిత్‌ తప్పుకున్నారు. అమరావతి కేసు విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని సూచించారు. ఏపీ విభజన చట్టం అంశంపై గతంలో తాను అభిప్రాయాన్ని ఇచ్చానని గుర్తు చేశారు. అందుకే అమరావతి రాజధాని కేసు విచారణ వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని సూచించారు. ఈ పిటిషన్‌పై విచారణను మరో బెంచికి బదిలీ చేసి లిస్టింగ్‌ చేయాలన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న ఏపీ హైకోర్టు తీర్పును జగన్‌ సర్కార్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రైతులు పిటిషన్లు వేశారు. రాజధాని పరిరక్షణ సమితి, రైతులు కేవియెట్‌ పిటిషన్లు దాఖలు చేశారు.
ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని.. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలని ప్రస్తావించారు. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధమన్నారు. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని గుర్తు చేశారు. అలాగే ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారని.. రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక , జీ ఎన్‌ రావు కమిటీ నివేదిక, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు నివేదిక, హైపవర్డ్‌ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయని గుర్తు చేశారు. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు అవసరమని.. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తవుతుందని ప్రస్తావించారు. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని..వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదన్నారు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తామని.. అలాగే అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది, ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img