Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

సుడిదోమ నివారణకు తూటికాడ కషాయంతో నివారణ

జిల్లా ప్రోజెక్టు మేనేజరు షణ్ముఖరాజు
విశాలాంధ్ర,పార్వతీపురం: సుడిదోమ నివారణకు తూటికాడా కషాయంతో చేసిన ద్రవాన్ని పిచికారి చేస్తే నివారణ జరుగుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయం అధికారులు తెలిపారు.మన్యం జిల్లాలో పార్వతీపురం మండలంలోని బందలుప్పి యూనిట్ పెదబొందపల్లి, చుక్కవాని వలస గ్రామాలలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ షణ్ముఖ రాజు , అడిషనల్ ప్రాజెక్ట్ మేనేజర్ ధనంజయలు కలిసి ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ కేంద్రాలను పరిశీలించారు. పెసర, మినుములు విత్తనాలను విత్తన శుద్ధి చేయడానికి బీజామృతం, తయారు చేయించడం జరిగింది. దీని వలన విత్తనం నుండి వచ్చే తెగుళ్లను నివారించవచ్చని తెలిపారు.చుక్కవానివలస గ్రామంలో వరి లో సుడిదోమ నివారణ కొరకు తూటికాడ కషాయంను తయారు చేయించారు.ఖర్చు లేకుండా సుడిదోమను తూటికాడ కషాయంతో నివారించవచ్చునని వారు తెలిపారు.తూటికాడ కాషాయం తయారు చేయడానికి కావలసిన పదార్థాలను వివరిస్తూ తూటికాడ ఆకులు 10కేజీలు ,ఆవుమూత్రం 10లీటర్లు అవసరమని అన్నారు.ముందుగా ఆవు మూత్రంను మరగబెట్టి,మరుగుతున్న ఆవుమూత్రంలో తూటికాడ ఆకులను మెత్తగా చిన్నముక్కలుగా కొట్టుకుని వాటినివేసి నాలుగు పొంగులు వచ్చేవరకు బాగా మరగబెట్టాలని తెలిపారు. అది చల్లారిన తర్వాత ఒక ట్యాంకుకు 15లీటర్ల నీటిలో ఆరలీటరు కషాయం వేసి పిచికారి చేయాలని చెప్పారు. దీనివలన వరిలో సుడిదోమని పూర్తిగా నివారించవచ్చని, ఖర్చు లేకుండానే రైతు సొంతంగా తయారు చేసుకోవచ్చని, రసాయనిక పురుగుమందులు వాడకపోవడం వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన పంటను పొందవచ్చని వారు చెప్పారు.తూటికాడ కషాయం సుడి దోమ నివారణకు చాలా బాగా పనిచేస్తుందని రైతులు వారి యొక్క అనుభవాలను వారితో పంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందడానికి అవకాసం ఉందని తెలిపారు. నేటి కాలంలో ఆరోగ్యానికి ప్రకృతి వ్యవసాయ సాగు పంటలు ఎంతో మేలు చేస్తుండటంతో ఈ ఉత్పత్తులు కొనడానికి పట్టణ ప్రాంతాలలో ప్రజలు, వినియోగదారులు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈకార్యక్రమంలో రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img