Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కేజ్రీవాల్‌, కవిత, మాగుంట

మద్యం స్కామ్‌పై ఈడీ అనుబంధ చార్జిషీటు

న్యూదిల్లీ : దిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను సంచలనం రేపింది. చార్జిషీటులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లను చేర్చింది. ఈ చార్జిషీటును రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. చార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో కేజ్రీవాల్‌, కవిత పాత్రను ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్టు ఈడీ వివరించింది. వి.శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని చార్జిషీట్‌లో పొందుపర్చింది. కవిత ఆదేశంతో అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు కోటి రూపాయలు ఇచ్చారని ఈడీ వెల్లడిరచింది. ఈ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ…ఐదుగురి పేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాను నిందితులుగా చేర్చింది. సౌత్‌గ్రూప్‌ లావాదేవీల్లో శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలక వ్యక్తులు. మొత్తం చార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ తన నివేదికను కోర్టుకు అందించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, అప్రూవర్‌గా మారిన దినేశ్‌ అరోరాతో పాటు ముందస్తు బెయిల్‌ తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. నవంబర్‌ 26న మద్యం విధానం వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో 3వేల పేజీలతో ఈడీ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. తొలి చార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, అతనికి చెందిన నాలుగు కంపెనీలపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు కూడా ఈడీ చార్జ్‌షీట్‌లో ఉంది. ఒబెరాయ్‌ హోటల్‌లో కుట్రకు సంబంధించిన వ్యవహారం జరిగిందని తెలిపింది. ఆమ్‌ అద్మీ పార్టీతో కవితకు పూర్తి సమన్వయం ఉందని, దిల్లీలో మద్యం షాపులకు ముఖ్యంగా ఎల్‌`1 షాపులు దక్కించుకునేలా పావులు కదిపారని ఈడీ తెలిపింది. కవిత ప్రత్యేక విమానంలో అనేకసార్లు హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వచ్చారని ఈడీ తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని పేర్కొంది. లంచం వ్యవహారాన్ని కవిత పర్యవేక్షించి పనిపూర్తయ్యేలా చేశారని ఈడీ ఆరోపించింది. సమీర్‌ మహేంద్రు మనీలాండరింగ్‌ వ్యవహారంలో దాఖలు చేసిన తొలి చార్జిషీట్‌పై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.
చార్జిషీట్‌ కల్పితం: కేజ్రీవాల్‌
మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో తన పేరు ఉండటంపై కేజ్రీవాల్‌ స్పందించారు. దిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ చార్జ్‌షీట్‌ మొత్తం ఓ కల్పితమని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా కాకుండా ప్రభుత్వాలను కూల్చడానికే ఈడీ పనిచేస్తోందని మండిపడ్డారు.
ఈడీ ఇప్పటి వరకు 5 వేలకు పైగా చార్జిషీట్లు దాఖలు చేసిందని.. అయితే ఎంతమందికి శిక్షలు పడ్డాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img