Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జీవో నం.1 రద్దు కోరుతూ చలో అసెంబ్లీకి సిద్ధం కావాలి

. జీఓని బేషరతుగా ఉపసంహరించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. ఈ జీవో జగన్‌కు ఉరితాడు కానుంది: శ్రీనివాసరావు
. రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారు: వర్ల రామయ్య

విశాలాంధ్ర`విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన జీవోనం.1 రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు ‘చలో అసెంబ్లీ’కి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. జీవోనం.1 రద్దు పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఐక్యవేదిక కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షతన ఇక్కడి ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఈ సదస్సు జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ జీవో నంబరు.1పై ఎన్ని నిరసనలు చేసినా ప్రభుత్వంలో కనీసం చలనం లేదన్నారు. ఈ జీవోని సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళితే స్టే ఇచ్చారన్నారు. తీర్పు వచ్చే వరకైనా ప్రభుత్వం జీవో నంబరు.1 అమలు నిలుపు చేయలేదన్నారు. గన్నవరంలో ప్రైవేటు స్థలంలో ఉపాధ్యాయులు ధర్నా చేసినా అరెస్టులతో అడ్డుకున్నారన్నారు. అనపర్తిలో చంద్రబాబు పర్యటన రెండు రోజులు ప్రశాంతంగా జరిగిందన్నారు. మూడవ రోజు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పోలీసులు ఖాకీ డ్రెస్‌ వేసుకుని ప్రభుత్వానికి బానిసలుగా పని చేస్తున్నారని విమర్శించారు. ఐపీఎస్‌ అధికారులు సీఎంకు జీతగాళ్లగా వ్యవహరిస్తున్నారన్నారు. చలో అసెంబ్లీ పెద్ద ఎత్తున నిర్వహించి నిరసన తెలియజేయాలన్నారు. అన్ని ప్రాంతాల నుంచి అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు తరలిరావాలని రామకృష్ణ కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే శాంతిభద్రతల సమస్యలను సృష్టిందని విమర్శించారు.జీవో నంబరు.1 అనేది సీఎం జగన్‌కు ఉరితాడుగా మారుతోందన్నారు. మోదీ చేస్తున్న అనాగరిక పాలనకు అనుగుణంగా సీఎం పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ సామాన్య ప్రజలకు రాజ్యాంగ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామిక వాదులు జీవోనం.1ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ అందరి హక్కులు కాలరాచి ఈ జీవోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ప్రతిపక్షాలను అణచివేలా జీవోలు తెచ్చినా గవర్నర్‌ కనీసం పట్టించుకోలేదన్నారు. రాబోయే తరాల కోసం ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ జీవోనం.1కు వ్యతిరేకంగా అందరూ సంఘటిమై ఉద్యమం చేయాలన్నారు. ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ జీవోనం.1ని రద్దుచేసే వరకు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాటాన్ని కొనసాగించాలన్నారు. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ కాలంనాటి జీవోలను తీసుకువచ్చి ప్రజాస్వామాన్ని నాశనం చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జీవోనం1 రద్దు ఐక్యవేదిక తీసుకునే నిర్ణయాలను జనసేన మద్దతు ఇస్తుందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ గతంలో వామపక్షాలు చేసిన విద్యుత్‌ ఉద్యమ స్పూర్తితోజీవోనం.1 రద్దు అయ్యేవరకు పోరాటాన్ని కొనసాగించాలన్నారు. సీఐటీయూ నాయకులు మురళి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, జనవిజ్ఞాన వేదిక నాయకులు లక్ష్మారెడ్డి, అమరావతి జేఏసీ నాయకులు బాలకోటేశ్వరరావు, మహిళా సంఘాల నాయకులు చెన్నుపాటి ఉషారాణి, ఆచంట సునీత, విద్యార్థి సంఘాల నాయకులు సోమేశ్వరరావు, గనిరాజు తదితరులు జీవోనం.1 రద్దు చేయాలని కోరుతూ ప్రసంగించారు. ముందుగా సదస్సుకు హాజరైన అతిథులను ఏఐపీఎస్‌ఓ రాష్ట్ర కన్వీనర్‌ మహంకాళి సుబ్బారావు వేదికపైకి ఆహ్వానించారు. ఈ సదస్సులో రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img