Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఎన్నికల కమిషనర్ల నియమాకంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ఎన్నికల కమిషనర్ల నియామకంపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వ తీరుపై గతంలో సుప్రీం అసహనం
కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని పిటిషన్‌

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి , ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీయే కమిషనర్లను ఎంపిక చేసి నియమించాలని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ప్రతిపక్ష నేత లేకపోతే లోక్‌సభలో విపక్ష మెజార్టీ పార్టీ ఎంపీని కమిటీలో సభ్యుడిగా చేర్చాలని సూచించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకే ఈసీలను రాష్ట్రపతి నియమించాలని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. అలా కాకుంటే వినాశక పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు (ఈసీ), ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) నియామకాలకూ కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు గత నవంబరులో ప్రకటించింది. మాజీ అధికారి అరుణ్‌ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించే దస్త్రం 24 గంటల్లో వాయువేగంతో అనుమతి పొందడంలో ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే ప్రశ్నించింది.అసలైన దస్త్రాన్ని సమర్పించడానికి ప్రభుత్వ అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశ ప్రధాన మంత్రిపై సైతం చర్యలు తీసుకునేంత సత్తా ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని ఈ అంశంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడిరది. దీనికి ఉదాహారణగా మాజీ ఎన్నికల అధికారి టీఎన్‌ శేషన్‌ను చూపింది.ఎన్నికల అధికారిని రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలని, అప్పుడే వారు స్వతంత్రంగా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలంటే.. ప్రధాన ఎన్నికల అధికారి నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది.ఇటీవల కాలంలో భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తీసుకున్న కొన్ని చర్యలు, అనుసరించిన వైఖరులు…స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించే పర్యవేక్షకురాలిగా, నిష్పక్షపాత మధ్యవర్తిగా తనకు గల పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ఇస్తామంటూ చేసే హామీలు, వాగ్దానాలు తమ పరిధిలోకి రావని గతంలో ఈసీ తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా కూడా తమ అధికారాలను ఉల్లంఘించి వ్యవహరించడమే అవుతుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img