Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

న్యాయ సంస్కరణలకు బ్రేక్‌

. నెతన్యాహు ‘టైమౌట్‌’ ప్రకటన
. సంయమనం పాటించాలని నిరసనకారులకు పిలుపు
. ఇజ్రాయిల్‌లో మిన్నంటిన ప్రజాందోళన
. 24 గంటల్లో 34 మంది అరెస్టు

టెల్‌అవీవ్‌: ఇజ్రాయిల్‌లో వివాదాస్పద న్యాయ సంస్కరణలపై దేశ ప్రజలు ఆందోళనకు దిగారు. 12 వారాలుగా వీటిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. తాజా పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో నెతన్యాహు ప్రభుత్వం మెట్టుదిగింది. న్యాయవ్యవస్థలోని సంస్కరణలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. సార్వత్రిక సమ్మెతో సోమవారం దేశం స్తంభించిన దృష్ట్యా ఆయన ఈ మేరకు ప్రకటించారు. ‘మన దేశాన్ని చీల్చేయాలని చూసే అతివాదులు ఉన్నారు. యుద్ధానికి దారితీయాలని, సాయుధ సేవలను నిరాకరించాలని చూస్తున్నారు. ఇది ఘోరమైన నేరమని తెలుసుకోండి’ అని ప్రధాని అన్నారు. మూడువేల ఏళ్ల కిందటి రాజు షోలోమో కథ నుంచి చాలా నేర్చుకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో ఇజ్రాయిల్‌ను చీలిపోనివ్వనని నెతన్యాహు ఉద్ఘాటించారు. చర్చల ద్వారా యుద్ధాన్ని నివారించేందుకు అవకాశమున్నప్పుడు అందుకు యత్నిస్తానని చెప్పారు. ఈలోగా దేశ ప్రజలు సంయమనం పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. హింసకు పాల్పడరాదని సూచించారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్న క్రమంలో న్యాయ సంస్కరణలను తక్షణమే నిలిపివేయాలని అధ్యక్షుడు ఐజక్‌ హెర్‌జాగ్‌ చేసిన సూచన మేరకు నెతన్యాహు తాజా ప్రకటన చేశారు.మరోవైపు నిరసనలు మిన్నంటిన క్రమంలో పోలీసులు 24 గంటల్లో 34 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసు అధికారులు స్టన్‌గ్రెనేడ్లను ప్రయోగించారు. వివాదాస్పద న్యాయసంస్కరణలకు వ్యతిరేకంగా 12 వారాల నుంచి ఇజ్రాయిల్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసనకారులు హోరెత్తించారు. దీంతో పోలీసులతో పాటు సైన్యం కూడా రంగంలోకి దిగి ఆందోళనపై ఉక్కుపాదం మోపింది. బాష్పవాయువు గోళాలు, స్టన్‌గ్రెనేడ్ల్‌ను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ఇదే క్రమంలో అనేకమంది నిరసనకారులను అరెస్టు చేశారు. ఇటీవల ఇజ్రాయిల్‌ ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు మధ్య విభేదాలు తలెత్తడంతో ఓ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని తనకు జైలుశిక్ష పడకుండా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. న్యాయవవస్థలో సంస్కరణల నెపంతో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో జడ్జీల నియామకం, ప్రభుత్వం జారీ చేసిన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కోర్టులకు లేకుండా చేయడం వంటి వివాదాస్పద సంస్కరణలు ఉండటంతో ఇజ్రాయిల్‌ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తన సంస్కరణలపై అభ్యంతరం వ్యక్తంచేసిన రక్షణమంత్రిపై వేటును నెతన్యాహు వేశారు. దీంతో మంత్రికి మద్దతుగా, న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రోడ్లపైకి వచ్చి నిరసన గళాన్ని వినిపించారు. ఇప్పుడు ప్రజాందోళన తీవ్రరూపం దాల్చింది. అతిపెద్ద కార్మిక సంస్థ సమ్మెకు దిగడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img