Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దురాలోచనకు దర్పణం చర్చలు లేని చట్టాలు

పార్లమెంటులో లోతైన చర్చలు జరిగితే ప్రజా ప్రయోజనం గల చట్టాలు రూపొందుతాయి. చర్చలు ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రతిబింబిస్తాయి. బలమైన ప్రతిపక్షం ఉన్నట్లయితే చర్చలకు ఎక్కువ అవకాశాలుంటాయి. లేకపోతే పాలకులు ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం, చర్చలు లేకుండానే బిల్లులను ఆమోదించి చట్టాలు చేసి ప్రజల మీద రుద్దడం పరిపాటి అయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌వి రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రకటించిన తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాహితమేగాక సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో జరిగిన సభలో ప్రధాన న్యాయమూర్తి, సక్రమంగా చర్చలు లేకుండానే చట్టాలు చేస్తున్నారన్న వ్యాఖ్యానం మరో సంచలనమే. ఆయన చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. గతంలోనూ పార్లమెంట్‌లో చర్చలు లేని చట్టాలు రూపొందాయి. ఏడేళ్లుగా పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌కు హాజరుకావడమే అరుదు. ఆయన పాలనలో ఏకపక్ష నిర్ణయాలు, చట్టాలు అనేకం రూపొందాయి. చర్చలు లేకుండా సభ ఆమోదంపొందిన చట్టాలలో అత్యధికం పాలకుల దురాలోచనకు దర్పణంగా నిలుస్తాయి. చర్చల ప్రమాణాలు పడిపోతున్నాయని, గతంలో వివేకవంతమైన చర్చలు జరిగి న్యాయస్థానాలకు భారం లేకుండా ఉండేవని కూడా ఎన్‌వి రమణ వెలిబుచ్చిన అభిప్రాయం నూటికి నూరుపాళ్లు నిజం. చర్చలు లేకుండా చేసే చట్టాలలో స్పష్టత ఉండటం లేదు. చట్టాల ఉద్దేశాలు, ఒనగూరే ప్రయోజనాలు చర్చల వల్ల స్పష్టమవుతాయి. ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్టుగా గతంలో న్యాయ నిపుణులు, ప్రజాహితం కోరి చర్చలకు అవకాశం ఇచ్చిన పాలకులు నేటికీ ఆదర్శంగా నిలుస్తారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు చేసిన అత్యధిక చట్టాలకు ప్రజామోదం ఉండేది. పాలకపక్షంలోనే గాక ముఖ్యంగా ప్రతిపక్షంలోనూ ఉద్దండులైన వామపక్ష నాయకులు ఎకె. గోపాలన్‌, హిరేన్‌ముఖర్జీ, భూపేష్‌గుప్తా, రాంమూర్తి తదితర అనేమంది చర్చలలో పాల్గొని చేసిన విలువైన సూచనలు ఆమోదించేవారు. బిల్లులను సవరించి చట్టాలు చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రతిపక్షాలతో నిమిత్తం లేకుండా మంది బలంతో నిరంకుశంగా చట్టాలను చేసి ప్రజలపై రుద్దుతున్నారు. ఓట్లువేసి తమను ఎన్నుకున్న ప్రజల ఆమోదం లేని ఎన్నో చట్టాలు ఇప్పుడు అమలులో ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర నిరసన తెలిపినా, ఆందోళన చేసినా పాలకులు పట్టించుకొనే పరిస్థితి లేదు. తాము అనుకున్న అజెండాను అమలు చేయడానికి ఎలాంటి చట్టాలనైనా చర్చలు లేకుండానే ఆమోదిస్తున్నారు. పార్టీని కాపాడుకొని మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి, ఆశ్రితులకు, కార్పొరేట్లుకు అనుకూలంగా, ప్రజాప్రయోజనాలు లేని చట్టాలు రూపొందించడం నేటి విషాదం.
తాజాగా ఆగస్టు 11వ తేదీతో ప్రకటిత గడువుకు రెండు రోజులు ముందుగానే ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో 20 బిల్లులు చర్చలు లేకుండా సభ ఆమోదించింది. ఒకే ఒక బిల్లుకు ప్రతిపక్షాలు కూడా తమ మద్దతు ప్రకటించడంతో ఏకగ్రీవంగా అది ఆమోదం పొందింది. అది రిజర్వేషన్‌ బిల్లు. పాలకపక్షంతో సహా అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లను ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నాయి. తక్షణం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో లబ్ధి పొందడమే పాలక బీజేపీ లక్ష్యం. యూపీలో ఇప్పటికే అనేక ఉపకులాల వారిని తమ వైపు తిప్పుకొనేందుకు ఆయా కులాల నుండి ఎంపిక చేసిన నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. తక్షణం రిజర్వేషన్ల చట్టం అమలు చేయకపోయినా మోదీ హామీలు గుప్పించగలరు. అనేక హామీలను విస్మరించినట్టుగానే రిజర్వేషన్‌ హామీని కూడా విస్మరించవచ్చు. ఏడేళ్లుగా ఇచ్చిన అనేక డజన్ల హామీలను అమలు చేయనే లేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయం ఎక్కువగా వృధా కావడానికి ప్రతిపక్షాలే కారణమని పాలకులు విమర్శిస్తున్నారు. తాము అనుకున్న బిల్లులకు మద్దతుగా చేతులెత్తడానికి తగినంతమంది ఎంపీలు ఉన్నందున పాలక పక్షం ముందుగానే వేసుకొన్న పథకం ప్రకారమే బిల్లులు ఆమోదం పొందాయి. అత్యంత ముఖ్యమైన ప్రజల జీవనంతో ముడిపడి ఉన్న సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షాలన్నీ కోరినప్పటికీ పాలకపక్షం పట్టించుకోలేదు. ప్రజల జీవన్మరణ సమస్యగా రెండేళ్లుగా బీభత్సం సృష్టిస్తున్న కొవిడ్‌ 19 మహమ్మారిపై కనీస చర్చలేదు. ఈ మహమ్మారి లక్షల మంది ప్రాణాలు హరించింది. సకాలంలో స్పందించి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో గానీ, మహమ్మారి విజృంభించిన కాలంలో వ్యాధి నియంత్రణకు, టీకాల పంపిణీ విషయంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలాగే వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తూ, దేశ ప్రజలందరికీ అన్నం పెడుతున్న రైతుల, వ్యవసాయ చట్టాల ఆమోదానికి ముందు కూడా సరైన చర్చే లేదు. కార్పొరేట్ల ప్రయోజనం కోసమే చేసిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది రైతులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. దేశమంతటా బంద్‌ నిర్వహించారు. దాదాపు తొమ్మిది నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో వివిధ చోట్ల రైతులు మహత్తర పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ముందుకు రావడంలేదు. పార్లమెంటులో చర్చకు సైతం అనుమతించలేదు. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న పర్యావరణ కాలుష్యం తగ్గింపు కోసం చేపట్టవలసిన చర్యలను కూడా పార్లమెంటు చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రభుత్వ ప్రణాళికలు వేయడం, నిధులు కేటాయింపులు మాత్రమే చేస్తోంది. ఆచరణ అరకొరగా ఉంది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి అంతర్‌ ప్రభుత్వాల పానెల్‌ తీవ్ర హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పాలకులు ప్రజల సహకారంతో కాలుష్యం తగ్గింపు కార్యాచరణను చేపట్టాలి.
నిఘా నీడలో దేశాన్ని పాలిస్తున్న వారు పెగాసస్‌ నిఘా వ్యవహారంపై తమకేమీ తెలియదన్నట్టుగా ఉన్నాయి. ఇది అత్యంత తీవ్రమైన సమస్య అయినప్పటికీ ప్రభుత్వ చర్చకు సిద్ధంగా లేకపోవడం విచారకరం. ఈ సమస్యలపై సమగ్ర చర్చ జరిగితే ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలు దేశ ప్రజలకు తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాలకులు ఎంతటి ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారనేది తేటతెల్లమవుతుంది. 1989లో బోఫోర్స్‌ కుంభకోణం వ్యవహారం అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని తల్లకిందులు చేసింది. అప్పుడు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలై విపిసింగ్‌ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడిరది. ముఖ్యమైన ప్రతిపక్షాలు కోరుతున్న చట్టాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ డొల్లతనం బయటపడితే 1989 నాటి పరిస్థితి తమకు ఎదురవుతుందేమోనన్న బెరుకు పాలకులకు ఉండవచ్చు. ప్రధాన న్యాయమూర్తి చట్టాలు రూపొందుతున్న విధానంపై వెలిబుచ్చిన ఆందోళన పాలకులకు కనువిప్పు కావాలి. ప్రజలు చట్టాల ప్రయోజనాలు, నష్టాల గురించి చైతన్యం పొంది తగిన విధంగా స్పందించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img