Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డబ్ల్యూహెచ్‌ఓకు 75 ఏళ్లు

ఆరోగ్య సమానత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు
జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం 75వ వార్షికోత్సవం జరుపుకుంది. నేటి అసాధారణ సవాళ్ల నేపథ్యంలో ఆరోగ్య సమానత్వం కోసం ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. 75ఏళ్ల కిందట చర్చోపచర్చలు, సమాలోచనల అనంతరం ప్రపంచ దేశాల మధ్య అంగీకారం కుదరడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైనట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధోనోమ్‌ ఘెబ్రేయేసెస్‌ తెలిపారు. 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ‘అనేక వ్యాధుల నుంచి ప్రజలను కాపాడటం కోసం అసాధారణ పురోగతిని కొన్ని దశాబ్దాల కాలంలో సాధించాం. 99శాతం వరకు పోలియోను, స్మాల్‌పాక్స్‌ను నిరోధించాం. బాల్యంలోనే వాక్సిన్‌లు ఇవ్వడం ద్వారా లక్షల ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం. గణనీయంగా జరిగిన పురోగతి క్రమంలో ప్రసూతి మరణాలు తగ్గాయి. ఆరోగ్య సంరక్షణ స్థాయి మెరుగైంది. మూడేళ్లుగా కోవిడ్‌ మహమ్మారి పీడిరచినాగానీ ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ అన్ని విధాలుగా సహకరించింది. శతాబ్దపు అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభ పరిస్థితులను నిలద్రొక్కుకునేలా తోడ్పాటు అందించింది. ఇందుకు పూర్తి ఘనత మాకే దక్కాలని చెప్పడం లేదు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది’ అని ట్రెడోస్‌ అన్నారు. అనేక విజయాలు సాధించినప్పటికీ ప్రపంచం ఇంకా ఎన్నో కొత్తపాత సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ముఖ్యంగా ఆరోగ్య సేవల్లో అసమానతలు, ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యల్లో వ్యత్యాసాలు, ఆరోగ్యానికి హానికలిగించే ఉత్పత్తులతో ఉన్న ముప్పుకు తోడు వాతావరణ సంక్షోభం ఉన్నదని చెప్పారు. అపరిష్కృత సవాళ్లు మానవాళిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు ట్రెడోస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు తక్షణ కార్యాచరణ అవసరమన్నారు. ఆరోగ్య సిబ్బందిని పెంచుకోవడం, రక్షణ చర్యలు చేపట్టడం ప్రధానమని ప్రపంచ దేశాలకు సూచించారు. అంతర్జాతీయంగా 10 మిలియన్‌ ఆరోగ్య కార్మికుల కొరతను 2030 నాటికి అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పేదవర్తమాన దేశాలకు ఆయన సూచనలు చేశారు. విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యరంగంలో సముచిత ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేస్తోందని ట్రెడోస్‌ అన్నారు. 2025 ముగిసే నాటికి పేద`వర్తమాన దేశాల్లో నర్సులలో 25 శాతం మందికి ప్రాథమిక అత్యవసర వైద్య సంరక్షణపై అవగాహన కల్పించేలా ‘గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌’కు ఇటీవలి ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీకారం చుట్టిందని తెలిపారు. ‘నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లు 1948 నాటి వారు ఊహించలేనివి. మన విజన్‌లో మార్పు రాబోదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యమ’ని ట్రెడోస్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img