Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలి

రాజా, ఏచూరి పిలుపు
బీహార్‌ సీఎం నితీశ్‌తో భేటీ – విపక్షాల ఐక్యతపై చర్చ

న్యూదిల్లీ: లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావడం మన ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ఎంతో ముఖ్యమని సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రతిపక్షాల ఐక్యతకు చర్యలు వేగం పుంజుకున్నాయని, రాష్ట్ర స్థాయిలో సీట్ల సద్దుబాటు జరుగుతుందని అన్నారు. ఇదే క్రమంలో మూడో ఫ్రంట్‌ ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదని ఏచూరి అన్నారు. ఎన్నికల తర్వాతే అది జరుగుతుందన్నారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను కలిసిన వామపక్ష నాయకులు… ప్రతిపక్షాల ఐక్యత, ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. భారతీయ గణతంత్రం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం లౌకిక ప్రజాస్వామ్య పార్టీల ఐక్యతకు చర్యలను నితీశ్‌ కుమార్‌ ముందుకు తీసుకెళుతున్నారు. ఆయన బీజేపీమోదీ ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. భారత్‌ను, ప్రజల జీవనోపాధి పరిరక్షణకు బీజేపీని ఓడిరచడం అనివార్యమన్నారు. భేటీ అనంతరం రాజా, ఏచూరి ట్విట్టర్‌లో స్పందించారు. ‘జేడీ(యూ) నేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను కలిసి ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమయ్యే దిశగా విస్తృతాంశాలను చర్చించాం. దేశం అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటోంది. సమాజంలోని అన్ని వర్గాలు బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మన ప్రజాస్వామ్యాన్ని, పౌరులను రక్షించుకోవడం కోసం లౌకికప్రజాస్వామ్య శక్తులు ఏకం కావడం తక్షణావశ్యం’ అని రాజా ట్వీట్‌ చేశారు. కేరళలో తమకు, కాంగ్రెస్‌కు మధ్య భీకర పోరు ఉంటుందని, బీజేపీకి అక్కడ అవకాశమే ఉండదని ఏచూరీ పేర్కొన్నారు. మూడవ ఫ్రంట్‌ అవకాశాలు లేకపోలేదని చెప్పిన ఆయన అది జరిగితే ఎన్నికల తర్వాతే అని అన్నారు. దేశంలో ఎన్నికల తర్వాత ఫ్రంట్లు ఏర్పాటు కావడం కొత్తేమీ కాదని అన్నారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌, 1998లో ఎన్డీయే, 2004లో యూపీఏ... ఎన్నికల తర్వాత ఏర్పాటు కావడాన్ని ఏచూరి గుర్తుచేశారు. నితీశ్‌ కుమార్‌ ఇంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోనూ భేటీ అయి ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించారు. విపక్షాల ఐక్యతపై పవార్‌ఖడ్గే భేటీ: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గేను ఆయన నివాసంలో కలిసి ప్రతిపక్షాల ఐక్యతా నిర్మాణంపై భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చించారు. వీరి సమావేశంలో రాహుల్‌ గాంధీ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కూడా ఖడ్గే, గాంధీతో భేటీ అయిన క్రమంలో పవార్‌ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్షాలు ఏకమవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img