Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఎన్‌కౌంటర్ల నిలయం యూపీ

ఎం. కోటేశ్వరరావు

అతీక్‌ అహమ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ అహమ్మద్‌ అనే నేరగాళ్లను శనివారం రాత్రి పదిన్నర గంటల(2023 ఏప్రిల్‌ 15వ తేదీ) సమయంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య విలేకర్లతో మాట్లాడుతుండగా ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలకు ఇది చక్కటి ఉదాహరణ. సులభంగా ప్రాణాలు తీసేందుకు కొత్త దారి చూపింది. ఇది పూర్వపు అలహాబాద్‌ నేటి ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. అంతకు రెండు రోజుల ముందు అతీక్‌ అహమ్మద్‌ 19 ఏళ్ల కుమారుడిని, అతని అనుచరుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ప్రజాస్వామ్య పుట్టినిల్లు భారత్‌ అని, ఇందుకు అనేక చారిత్ర ఆధారాలున్నాయని కావాలంటే పదకొండువందల సంవత్సరాల నాటి తమిళ శాసనాన్ని చూడవచ్చని చరిత్రకారుడి అవతారం ఎత్తిన ప్రధాని నరేంద్రమోదీ తమిళ సంవత్సరాది సందర్భంగా చెప్పినమాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తుండ గానే ఇదిజరిగింది. శిష్యుడు యోగి ఏలుబడిలో ఆటవికఉదంతం. హంతకులు తుపాకులు కాల్చుతూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేశారట. వారిలో ఒకడు భజరంగ్‌దళ్‌ జిల్లా నేత. ఒక పెద్ద గూండాను చంపి తాము పేరు తెచ్చు కోవాలని ఆ ముగ్గురు చిల్లర గూండాలు చెప్పారంటే ఏకంగా ప్రధాని మోదీ ప్రాతినిధó్యవహిస్తున్న, యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలోఉన్న యూపీలో గూండాలకు, గూండాయిజానికి ఎంత పలుకుబడి, ఆరాధాన ఉందో వెల్లడైంది.
తమ ముందే ఇద్దరిని కాల్చిచంపుతుంటే కళ్లప్పగించి యూపీ పోలీసులు చూశారంటే వారి రాక గురించి ముందే ఉప్పంది ఉండాలి లేదా హంతకులు జై శ్రీరామ్‌ అన్నారు గనుక వారు అధికార పార్టీ వారైతే లేనిపోని తంటామన కెందుకని వదలివేశారా? ఆ వచ్చిన దుండగులు జర్నలిస్టుల ముసుగులో వచ్చారు. పోలీసులకు వారెవరో తెలీదు. ఎవరినీ తనిఖీ జరపలేదు. ఇద్దరిని చంపిన తరువాత వారు మిగిలినవారిని కూడా చంపుతారేమో అన్న అనుమానం కూడా వారికి రాలేదు. వారు పారిపోకుండా కనీసం కాళ్లమీద నైనా కాల్పులు జరపలేదు. యూపీలో యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదివారం రాష్ట్రమంతటా ఆంక్షలువిధించి మిగిలినపనులు కూడాచేసింది. గత ఆరు సంవత్సరాల్లో తనపాలనలో మాఫియా, గూండా గాంగులను అంత మొందించినట్లు చెప్పుకుంటున్న సిఎం అంతా సజావుగా ఉంటే ఈ పని ఎందుకు చేసినట్లు ? అవసరం ఏమి వచ్చింది? నిజంగా గూండాలు, తీవ్రవాదులు జనం మీద, భద్రతా దళాల మీద దాడులకు దిగినపుడు జరిగే ఎన్‌కౌంటర్లలో వారిని చంపితే అదొక తీరు. నకిలీ ఎన్‌కౌంటర్లు జరిపితే అది ప్రజాస్వామ్యమా అన్నది నాగరికుల్లో కలిగే సందేహం. అతీక్‌ అహమ్మద్‌ కుమారుడు, మరొకరిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే అతీక్‌ సోదరులను ఒక పధకం ప్రకారం మట్టుబెట్టించారని అనేకమంది భావన. పేరు మోసిన గూండాలను కాల్చిచంపినా తప్పుపడితే ఎలా అని తక్షణ న్యాయం కావాలని కోరుకొనే కొందరు ప్రశ్నిస్తారు. ఇలా ప్రశ్నించటం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మన దేశం అని చెప్పిన ప్రధాని మోదీని అవమానించటం తప్ప మరొకటి కాదు. మతమార్పిడి, లౌ జీహాద్‌ నిరోధ చట్టాల మాదిరి పేరు మోసిన నిందితులను కాల్చి చంపాలని ప్రభుత్వ పెద్దలు తమకు ఉన్న మెజారిటీని ఆసరా చేసుకొని చట్టాలను చేసి అందుకు పూనుకుంటే అది వేరే.
యూపీలో యోగి అధికారానికి వచ్చిన తరువాతే నేరగాండ్లను మట్టుబెట్టి పీడ లేకుండా చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతున్నది. జాతీయ మానవహక్కుల సమాచారం ప్రకారం 2017 మార్చి2022 మార్చి వరకు దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక ఎన్‌కౌంటర్‌తో 813 మంది మరణించినట్లు వెల్లడిరచింది. ఇవన్నీ యూపీలో జరిగినవి కావు. దుండగులు తమ వద్ద ఉన్న తుపాకులను లాక్కొనేందుకు, తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు, తనిఖీ జరుపుతుండగా కాల్పులు జరిపినపుడు ఆత్మరక్షణ కోసం కాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. యోగి అధికారంలో లేనపుడు కూడా యూపీలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. జాతీయ మానవహక్కుల సంస్థ సమాచారం ప్రకారం 20022008 వరకు దేశంలో 440 ఎన్‌కౌంటర్‌ కేసులు జరిగితే, రాష్ట్రాల వారీ యూపీలో 231, రాజస్థాన్‌లో 33, మహారాష్ట్ర 31, ఢల్లీి 26, ఆంధ్రప్రదేశ్‌ 22, ఉత్తరాఖండ్‌ 19 ఉన్నాయి. 2009 అక్టోబరు2013 ఫిబ్రవరి వరకు 555 ఉదంతాలు జరగ్గా, రాష్ట్రాల వారీ యూపీలో 138, మణిపూర్‌ 62, అసోం 52, పశ్చిమ బెంగాల్‌ 35, రaార్ఖండ్‌ 30 ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు మరణించారు. ఈ కాలంలో యోగి అధికారంలో లేరు. ఉత్తర ప్రదేశ్‌లో వేర్పాటు వాదం లేదా నక్సల్‌ సమస్యలేదు. యూపీ పోలీసు కస్టడీ మరణాలకు పేరుమోసింది. దీని గురించి ఎక్కడా ప్రచారంజరగదు ఎందుకు? వారంతా ఎవరు, నేరగాండ్లేనా? టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 జూలై 26న ప్రచురించిన వార్త చెప్పిందేమిటి? 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2022 మార్చి 31 వరకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సమాచారం ప్రకారం దేశంలో 4,484 పోలీసు కస్టడీ మరణాలు, 233 ఎన్‌కౌంటర్‌ మరణాలు జరిగినట్లు లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. వీటిలో యూపీ 952 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. నరేంద్రమోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ దుర్మార్గం ఏమిటనిగానీ, ప్రజాస్వామ్య కబుర్లు చెపితే జనం ఏమనుకుంటారని గానీ ఎప్పుడైనా ఆత్మావలోకనం చేసుకున్నారా? ఒక పెట్టుబడిదారుడిని చంపినంత మాత్రాన దోపిడీ, ఒక భూస్వామిని చంపినంత మాత్రాన గ్రామాల్లో అణచివేత అంతరించదు. అలాగే గూండాలను చంపినంత మాత్రాన గూండాయిజం అంతం కాదు. అదే జరిగి ఉంటే 1990 దశకం నుంచి 2000 దశకం వరకు ముంబై,మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో గూండాలు, మాఫియాడాన్లను పోలీసులు చంపివేశారు. వాటితో అక్కడ ఇప్పుడు గూండాయిజం అంతరించిందా ? కొత్తవారు పుట్టుకువస్తూనే ఉంటారు. ఏప్రిల్‌ 13న ఎన్‌కౌంటర్‌లో చంపిన పందొమ్మిదేండ్ల అతీక్‌ అహమ్మద్‌ కుమారుడికి యోగి అధికారంలోకి వచ్చే నాటికి 13 సంవత్సరా లుంటాయి. అతీక్‌ అహమ్మద్‌ సోదరులను హతమార్చిన ముగ్గురు నేరగాండ్ల గురించి చూస్తే వారిలో లవలేష్‌ తివారీ అనే వాడు సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన భజరంగ్‌ దళ్‌ నేతగా ఉన్నాడని వార్తలు. తమకేం సంబంధం లేదని ఆ సంస్థలు ప్రకటించటం ఊహించనిదేమీ కాదు. ఫేస్‌బుక్‌లో తనను భజరంగ్‌ దళ్‌ జిల్లా సహ నేతగా వర్ణించినపుడే తమకే సంబంధం లేదని ప్రకటించి ఉంటే వేరు, ఇప్పుడు చెబుతున్నారంటే గాడ్సేను కూడా అలాగే తమవాడు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన సంగతి గుర్తుకు వస్తోంది. నేరం చేసిన తరువాత జై శ్రీరామ్‌ అనటాన్ని బట్టి, ముగ్గురూ కలసి వచ్చారంటే మిగిలిన ఇద్దరు కూడా ఆ బాపతే లేదా తోడు తెచ్చుకున్న నేరగాండ్లన్నది స్పష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన వారిని పోలీసులే ఒక దగ్గరకు చేర్చి ఉండాలి. యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇప్పటి వరకు పదివేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిపారని వార్తలు. దీనితో నేరాలు అదుపులోకి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. యూపీలో యోగి అధికారానికి రాక ముందు 2016లో నమోదైన అన్ని రకాల కేసులు 4,94,025 కాగా 2020లో అవి 6,57,925 కు పెరిగాయి. దేశంలో 45,75,746 నుంచి 62,91,485కు చేరాయి. దేశంలో పెరిగినట్లుగానూ ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉన్నాయి.మొత్తం కేసులలో అక్రమంగా ఆయుధాలు కలిగినవి 2021లో దేశంలో వందకు 3.3 ఉంటే యూపీ 11.8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఎన్‌కౌంటర్ల గురించి ప్రచారం మీద చూపిన శ్రద్ద ఇతర అంశాలపై లేదు. తమకు విధించిన జీవితకాల శిక్ష గురించి చేసుకున్న అప్పీళ్లు సంవత్సరాల తరబడి విచారణకు రావటం లేదంటూ 18మంది నేరస్థులు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన విన్నపంలో అలహాబాద్‌ హైకోర్టులో 160 మంది జడ్జీలకు గాను 93 మందే ఉన్నారని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు వారికి బెయిల్‌ ఇచ్చింది. ‘‘బలహీన వర్గాలకు చెందిన వారు ఎప్పటికీ కస్టడీలోనే ఉంటున్నారు. మా అనుభవంలో అలాంటి వారు జైళ్లలో ఉంటున్నారు.ఉన్నత సమాజానికి చెందిన ఒక నేరగాడు శిక్ష పడే సమయానికి దేశం నుంచి తప్పించుకున్నాడని’’ ఆ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఇది యోగి సర్కార్‌ సిగ్గుపడాల్సిన అంశం. 2021 ఆగస్టు నాటికి 1.8లక్షల క్రిమినల్‌ అప్పీళ్లు హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్నాయి. రెండువేల సంవత్సరం నుంచి కేవలం 31,044 కేసులనే హైకోర్టు పరిష్కరించింది. పదేండ్లకు ముందు అప్పీలు చేసిన ఖైదీలు 7,214 మంది జైల్లో ఉన్నారు. 2017 మార్చి2021 ఆగస్టు వరకు యూపీ పోలీసులు జరిపిన 8,472 ఎన్‌కౌంటర్లలో 3,302 మంది నేరారోపణలు ఉన్నవారు గాయపడ్డారు. వారిలో 146 మంది మరణించారు. పోలీసు ఎన్‌కౌంటర్లు పెద్ద ఎత్తున జరగటం అంటే అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ యంత్రాంగం, న్యాయాన్ని అందించాల్సిన వ్యవస్థ వైఫల్యానికి చిహ్నం. పోలీసు యంత్రాంగాన్ని ఎన్‌కౌంటర్ల విభాగంగా మార్చితే జవాబుదారీతనాన్ని లోపించిన దాన్ని సంస్కరించటం అంత తేలిక కాదు. చివరకు పెంచి పోషించిన వారికే తలనొప్పిగా మారుతుంది. అధికారం మారితే అదే పోలీసు యంత్రాంగం పాలకులు ఎవరి మీద గురి పెట్టమంటే వారి మీదే తుపాకులను ఎక్కు పెడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img