Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పోలవరం ఎత్తు తగ్గింపు కుట్రే

. కేంద్ర వైఖరిపై సీఎం జగన్‌ స్పష్టతివ్వాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎత్తు తగ్గించే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. పోలవరంలో పర్యటించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రాజెక్టు లక్ష్యసాధనకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లు కనపడుతోందన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే కేంద్రం చేస్తున్న ద్రోహంపై స్పందించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఆ ప్రకటన ఇలావుంది. ఏపీకి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పదేపదే ద్రోహం చేస్తూనే ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కూడా అదే ధోరణి అవలంబిస్తోంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించే కుట్రలకు పాల్పడుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగితే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు ఎంతో ప్రయోజనకరం. 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంది. ఒకపక్క 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు అవసరమయ్యే నిధులంటూ రూ.12,911.15 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలో భాగమే. మరోపక్క 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించి, తొలిదశగా 41.15 మీటర్లకు నీళ్లు నిలబెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది తొలి, మలి దశల గురించి కేంద్రం తన ఆదేశాల్లో ప్రస్తావించక పోవడం గమనార్హం. పోలవరం ఎత్తు తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను సీపీఐ ఖండిస్తున్నదని ఆ ప్రకటనలో రామకృష్ణ పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పదేపదే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పేరుగాంచిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీల విషయాలను మంటగలుపుతున్నది. కేంద్ర ప్రభుత్వ దుష్ట పన్నాగాలను తిప్పికొట్టడంలో వైసీపీ ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోంది. కేంద్రం మెడలు వంచి రాష్ట్ర అభివృద్ధికి నిధులు సాధించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైంది. పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించేందుకు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపేందుకు, విభజన చట్ట హామీల అమలుకోసం, రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచకుండా జగన్‌ సర్కార్‌ చోద్యం చూస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అడుగడుగునా ఏపీకి ద్రోహం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టడాన్ని రామకృష్ణ నిరసించారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు సందర్శించిన నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణంపై, నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై స్పష్టత నివ్వాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆ ప్రకటనలో రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img