Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

నేను…మీ వెంటే !

అమరావతి రైతులకు సోనూసూద్‌ అభయం

అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గత 632 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సినీ నటుడు, ప్రముఖ సంఘ సేవకుడు సోనూసూద్‌ మద్దతు ప్రకటించారు. విజయవాడ నగరంలో తల్లీపిల్లల వైద్యశాల ప్రారంభానికి ముఖ్యఅతిథిగా గురువారం ఏపీ పర్యటనకు వచ్చిన సోనూసూద్‌ను గన్నవరం విమానాశ్రయం వద్ద అమరావతి మహిళా రైతులు కలిశారు.
తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాను ఎల్లవేళలా రైతుల వెంటే ఉంటానని స్పష్టం చేశారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కారు ఎక్కి విజయవాడ బయలుదేరుతున్న సమయంలో మహిళా రైతులు ఒక్కసారిగా ఆయన కారును చుట్టుముట్టి, అమరావతి ఉద్యమానికి మీ మద్దతు కావాలని కోరారు. ఆయన నవ్వుతూ నేను మీ వెంటే ఉంటానంటూ వారికి అభయమిచ్చారు. ఈ సందర్భంగా రైతులు ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, జై అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, రైతుల త్యాగాలను గుర్తించండి, సర్వ మతాల రాజధాని అమరావతి.. అనే నినాదాలతో కూడిన ప్లకార్డులు చేతబూనారు. ఇక మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి, వెంకటపాలెం, దొండపాడు తదితర గ్రామాలలో దీక్షలు నిర్వహించారు. రాత్రి పూట కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్ర ప్రజల కోసం, భావితరాల కోసం మూడు పంటలు పండే భూమిని తాము త్యాగం చేస్తే పాలకులు తమ రాజకీయ స్వార్థంతో దానిని బీడు భూమిగా మార్చారని, ఈ పరిస్థితిని చూసి మా గుండెలు పగిలిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, పాలకులకు గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img