Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అదానీ, అంబానీకి ప్రభుత్వ ఆస్తులు

విభజన హామీలు, ప్రత్యేక హోదా ఏవీ?

కడప స్టీలు ఫ్యాక్టరీని అడిగితే విశాఖ ఉక్కును అమ్ముతారా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెబుదాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు
అనంతలో పాదయాత్ర ప్రారంభం
ప్రజల నుంచి విశేష స్పందన

అనంతపురం : మోదీ సర్కారుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అదానీ, అంబానీలకు కేంద్రం అమ్ముడుపోయిందని విమర్శించారు. అడుగడుగునా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని చెప్పారు. విభజన హామీలను విస్మరించిందని, ప్రత్యేక హోదాను పక్కనపెట్టిందని, కడప స్టీలు ఫ్యాక్టరీ ఊసేలేదని దుయ్యబట్టారు. సీపీఐ జన ఆందోళన్‌లో భాగంగా మంగళవారం రామకృష్ణ అనంతపురంలోని కేకే కాలనీ క్వార్టర్సు నుండి పాదయాత్ర ప్రారంభించారు. అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌, టవర్‌క్లాక్‌, సప్తగిరి సర్కిల్‌, గాంధీబజార్‌ మీదుగా బుక్కరాయసముద్రం వరకూ పాదయాత్ర జరిగింది. పాదయాత్ర సందర్భంగా రామకృష్ణ ప్రెస్‌క్లబ్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ జన ఆందోళన్‌ను చేపట్టిందని రామకృష్ణ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 21వ తేదీ వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అందులో భాగంగా మంగళవారం అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని

వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను తన మిత్రులకు కారుచౌకగా కట్టబెట్టడానికి ప్రైవేటీకరణ నినాదం అందుకుందని ఆగ్రహం వెలిబుచ్చారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులు అంబానీకి కట్టబెట్టిందన్నారు. కడపలో స్టీల్‌ఫ్యాక్టరీ కోసం ఓపక్క పోరాటం చేస్తుంటే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. మోదీ కళ్లు తెరిపించడానికే జన ఆందోళన్‌ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 27న జరగబోయే భారత్‌బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత్‌బంద్‌లో 500 రైతు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, పాల్గొంటున్నాయని వివరించారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ జెండాలు పక్కనపెట్టి భారత్‌బంద్‌కు మద్దతివ్వాలని డిమాండు చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు మాట్లాడుతూ మోదీ హయాంలో పెట్రోలు, డీజిలు, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని విమర్శించారు. మోదీ అధికారం చేపట్టే నాటికి 55 రూపాయలు ఉన్న డీజిలు ధర ఇప్పుడు వంద రూపాయలకు, 60 రూపాయలు ఉన్న పెట్రోలు 112 రూపాయలకు, రూ.450 వంటగ్యాస్‌ రూ.1000కు పెరిగిందని వివరించారు. ప్రభుత్వ ఆస్తులను ఎడాపెడా అమ్మేస్తోందని మండిపడ్డారు. రూ.75 లక్షల కోట్ల ఆస్తులు ఆరున్నర లక్షల కోట్లకు అమ్ముతున్నారని, ఈ మొత్తాన్ని ఎవరికి దోచిపెట్టడానికని ఓబులేశు ప్రశ్నించారు. ప్రజాందోళనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని, అందుకు అన్ని వర్గాల ప్రజలు తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు హరినాథరెడ్డి మాట్లాడుతూ మోదీ, జగన్‌ ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, కార్మికులు ఉద్యమబాట పడుతున్నారన్నారు. సీపీఐ అధ్వర్యంలో చేపడుతున్న పాదయాతకు అనంతపురం జిల్లా ప్రజల స్పందన అభినందనీయమని, ప్రజలు పాదయాత్రను స్వాగతిస్తున్న తీరు ఉద్యమాలకు ఊపిరి పోస్తుందన్నారు.
జిల్లా కార్యదర్శి జగదీశ్‌ ప్రసంగించారు. పాదయాత్రలో రైతుసంఘం జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర నాయకులు మనోహర్‌రెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్‌, నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, వేమయ్యయాదవ్‌, రాజారెడ్డి, నగర కార్యదర్శి శ్రీరాములు, రామకృష్ణ, నారాయణస్వామి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, సిద్ధయ్య, మండల కార్యదర్శులు రమేష్‌, హరికృష్ణ, నాగరాజు, విద్యార్థి, యువజన నాయకులు ఆనంద్‌, సంతోష్‌, శ్రీకాంత్‌, మనోహర్‌, చిరంజీవి, ఏఐటీయూసీ నాయకులు రాజేష్‌, కృష్ణుడు, ప్రజాసంఘాల నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img