Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సరసమైన ధరకే ఇసుక

అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు
వర్షాకాలం తర్వాత మరిన్ని రీచ్‌లు, డిపోలు
అక్రమ మద్యం, గంజాయి రవాణాపై ఉక్కుపాదం
డ్రగ్స్‌కి వ్యతిరేకంగా అవగాహనా సదస్సులు
ఎస్‌ఈబీ సమీక్షలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రభుత్వం నిర్దేశించిన సరసమైన ధరలకే ప్రజలకు ఇసుక సరఫరా చేయాలని, ఎవరైనా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లు తెలిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై అధికారులు వివరాలు తెలిపారు. ఇప్పటివరకు మద్యం అక్రమ రవాణా, తయారీలకు సంబంధించి 1,20,822 కేసులు నమోదు చేశామని, 1,25,202 మంది నిందితులను అరెస్టు చేసి…వారి నుంచి 8,30,910 లీటర్ల అక్రమమద్యం, 8,07,644 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని, 29,491 వాహనాలు సీజ్‌ చేశామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 12,211 కేసులు నమోదు చేసి, 22,769 మంది నిందితులను అరెస్టు చేశామని, 16,365 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి సాగు, రవాణాకు సంబంధించి 220 కేసులు నమోదు చేసి 384 మందిని అరెస్టు చేశామని, 18,686 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్‌ఈబీ కాల్‌సెంటర్‌ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలని, ఇసుక అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌ చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రేట్ల వివరాలు తెలియజేస్తూ అడ్వర్టైజ్‌మెంట్‌ ఇవ్వాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచనున్నట్లు వెల్లడిరచారు. గంజాయి సాగు, మద్యం అక్రమరవాణా, తయారీలపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు. మద్య నియంత్రణలో భాగంగా రేట్లు పెంచామని, మరోవైపు మూడిరట ఒక వంతు దుకాణాలు మూసివేయడంతోపాటు బెల్టుషాపులు తీసేశామన్నారు. దీనివల్ల లిక్కర్‌ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయని, బీరు సేల్స్‌ నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయన్నారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, తయారీని అడ్డుకోవాలన్నారు. నిందితులపై కఠిన చర్యల కోసం ఇప్పటికే చట్టం తీసుకొచ్చామన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమీక్షా సమావేశానికి ప్లానింగ్‌ అండ్‌ రిసోర్స్‌ మొబలైజేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్‌, ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌, ఎస్‌ఈబీ డైరెక్టర్‌ (స్పెషల్‌ యూనిట్స్‌) ఎ.రమేష్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img