Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ప్రతిభ

512 మార్కులతో ప్రతిభ చూపిన అంజూరి జోష్ణ

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మండల కేంద్రంలోని రామాలయం వీధిలో గల నిరుపేద కుటుంబానికి చెందిన అంజూరి జోష్ణ 512 మార్కులతో ప్రతిభ చాటింది. చింతపల్లి లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆమె ఈ ఏడు పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల టాపర్గా నిలిచింది. మండల కేంద్రానికి చెందిన జోష్ణ తండ్రి అంజూరి శ్రీనివాసరావు(లేటు), తల్లి వరలక్ష్మి దంపతుల ఇద్దరు కుమార్తెలలో మొదటి కుమార్తె జోష్ణ కాగా తన తండ్రి పాత ఇనుప సామాన్లు(స్క్రాప్) క్రయవిక్రయాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. దురదృష్టవశాత్తు తండ్రి క్యాన్సర్ వ్యాధితో గత ఆరు నెలల క్రితం మరణించగా కుటుంబ పోషణకై తల్లి వరలక్ష్మి చిన్న టిఫిన్ దుకాణం నడుపుతూ తనని, చెల్లిని చదివిస్తుందని జోష్నా తెలిపింది. తల్లి నడుపుతున్న టిఫిన్ దుకాణంలో సహాయకారిగా ఉంటూనే పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యానని ఆ విద్యార్థిని పేర్కొంది. తండ్రి మరణానంతరం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ తల్లి టిఫిన్ దుకాణమే తమకు జీవనాధారమని, డాక్టర్ చదవాలన్నదే తన లక్ష్యమని కానీ తమ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని వాపోయింది. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం, దాతలు సహకరిస్తే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలనని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img