Friday, April 26, 2024
Friday, April 26, 2024

అనంతపురం జిల్లాలో పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

డ్రిప్‌ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పొలంగట్టు కార్యక్రమాన్ని చేపట్టాలి
ఏపి రైతు సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లికార్జున
విశాలాంధ్ర` అనంతపురం వైద్యం :
ఆరుగాలం శ్రమించి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి చేతికందాల్సిన పంట దక్కకుండా పోవడంతో అనేక మంది అన్నదాతలు దిక్కు తోచని స్థితిలో పడ్డారని ఏపి రైతు సంఘం జిల్లా కార్యనిర్వాహక అద్యక్షుడు మల్లికార్జున పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు సంఘం నాయకులు, వివిధ గ్రామాల రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి, పప్పుశనగ,పత్తి,వేరుశెనగతోపాటు బొప్పాయి,దానిమ్మ, అరటి,చీని తదితర ఉద్యాన పంటలు మిరప,టమోటా ఇతర కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పంటనష్టపోయిన ప్రతిరైతును అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై వుందన్నారు. జిల్లాలో పంటనష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.జిల్లాలో 12 వేలఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయినట్లు ప్రత్యక్షంగా కనబడుతోందని అయితే కేవలం 9వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు తప్పుడు లెక్కలు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్‌ రైతు భరోసా కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించాడే గాని అన్నదాతలకు ఎలాంటి భరోసా కల్పించకలేక పోయాడని ఘాటుగా విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో అతివృష్టి అనావృష్టి తాండవిస్తోందని దీంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. సిఎం జగన్‌ రైతు ప్రభుత్వం పేరుతో రైతులను మోసం చేస్తూ వారిని అధోగతి పాలు చేస్తున్నాడని తూర్పారబట్టారు.జిల్లాలో నష్టపోయిన వరి ,మొక్కజొన్న పత్తి ,వేరుశనగ, పప్పుశనగ తదితర పంటలకు ఎకరాకు 25 వేలు,పండ్ల తోటలకు ఎకరాకు 50 వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడప కార్యక్రమం కేవలం ఎన్నికల ప్రచారమే నని దుయ్యబట్టారు.గడప గడప కార్యక్రమాన్ని నిలిపివేసి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పొలం గట్టు కార్యక్రమాన్ని చేపట్టాలని తద్వారా అన్నదాతలను ఆదుకోవాలన్నారు.గత ప్రభుత్వ హయాంలో వర్షాదార పంటలకు సబ్సిడీ డ్రిప్పు పరికరాలను మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రిప్‌ పరికరాల సబ్సిడీ ఎత్తివేశారని అయితే రైతు సంఘాలు ఉద్యమించడంతో సబ్సిడీని కొనసాగిస్తామని చెప్పడం సంతోషకరమన్నారు.గత ప్రభుత్వం బీసీలకు 10 ఎకరాల భూమికి 90 శాతం సబ్సడీ ఇచ్చిందని అయితే వైసీపీ ప్రభుత్వం దాన్ని ఐదు ఎకరాలకు కుదించడం బాధాకరమన్నారు.సబ్సిడీ మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం బిసి, ఎస్సీ ,ఎస్టీ లకు అన్యాయం చేస్తోందన్నారు.జిల్లాలో పంట నష్ట పోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని,డ్రిప్పు పరికరాల పై 12 శాతం జీఎస్టీని మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు,రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.అనంతరం ఆర్డిఓ మధుసూదన్‌ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి నాయకులు రామకృష్ణ, రైతు సంఘం నాయకులు వెంకటనారాయణ,రమేష్‌,రాజు,నాగభూషణం,వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img