Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కాయగూరల మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి లలో ఆకస్మిక తనిఖీలు.

.ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని నూతన కాయగూరల మార్కెట్ను, ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం ఆకస్మికంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తనిఖీ చేశారు. తొలుత కాయగూరల మార్కెట్లో రైతులను చిన్న ,పెద్ద వ్యాపారస్తులను మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పలు విషయాలను తెలుపుతూ, మీకు కేటాయించిన గదులలో మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలని బయటకు సరుకు తీసుకొని రావద్దని తెలిపారు. కాయగూరల మార్కెట్ లోపల ఎటువంటి సుంకము వసూలు చేయరాదని, బయట సుంకం వసూలు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం గదులను వేలంపాటలో స్వాధీనం చేసుకున్న వారి నుండి బకాయిలు ఉన్న యెడల త్వరితగతిన వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ను ఆదేశించారు. కాయగూరల మార్కెట్ ను ఎప్పటికప్పుడు అపరిశుభ్రత లేకుండా వెనువెంటనే ట్రాక్టర్ల ద్వారా చెత్తను తొలగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. అనంతరం కాలిబాటన వెళుతూ పాత మునిసిపల్ మస్టర్ కార్యాలయమునకు ఎదురుగా గల గాంధీ పార్కును వారు సందర్శిస్తూ, ప్రజల ఫిర్యాదు మేరకు గాంధీ పార్కులో ప్రజలు సేద తీర్చుకునేందుకు అవకాశం ఉండేలా చూడాలని, ప్రతిరోజు గేటు తలుపులు ఎందుకు మూస్తారు అని వారు ప్రశ్నించారు? ఇది మున్సిపాలిటీ స్థలమని, ప్రజల కొరకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు వారు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని కూడా తనిఖీ చేస్తూ, డాక్టర్ సుష్మా రెడ్డి ద్వారా ఆసుపత్రిలోని సమస్యలను, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి వార్డులలో గల రోగులను స్వయంగా వెళ్లి, వారికి ఆసుపత్రిలో వైద్యం ఏ విధంగా అందు తోంది? అన్న వివరాలను కూడా తెలుసుకున్నారు. తదుపరి శవ పరీక్ష గదిని కూడా వారు పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రేమతో పలకరించాలని, నాణ్యమైన వైద్య చికిత్స తో పాటు, మందుల సరఫరా కూడా క్రమంగా జరగాలని వైద్యులకు ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎమ్మెల్యేతో విన్నవించుకుంటూ.. తమకు ఆరు నెలలుగా జీతాలు రాలేదని, తమ కుటుంబ జీవనం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారితో సెల్ఫోన్లో మాట్లాడుతూ తక్షణమే జీతాలను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవతో కూడిన వైద్యం, ఆసుపత్రి ఆవరణమును నిరంతరం పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని తెలిపారు. తదుపరి ఎమ్మెల్యే తన ఆరోగ్యం కొరకు వైద్య చికిత్సలను కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు, కౌన్సిలర్ గజ్జల శివ, వైఎస్ఆర్సిపి నాయకులు గుర్రం రాజా, ఆసుపత్రి హెడ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img