Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు…

తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జ్యోతి నివాసంతో, హనుమకొండలో సామాజిక కార్యకర్త అనిత,ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంలోని చైతన్య మహిళా సంఘం కో కన్వీనర్‌ రాధ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోమవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయమే వారి ఇళ్లలోకి ప్రవేశించిన ఎన్‌ఐఏ అధికారులు సమీపంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హనుమకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసముండే అనిత చైతన్య మహిళా సంఘం సభ్యురాలిగా కొనసాగుతూ స్థానికంగా ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. మూడురోజులుగా ఆమె కదలికలపై నిఘా పెట్టిన ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం ఇంటికి వచ్చి ఆమెను ప్రశ్నించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకే ఆమె ఇంట్లో సోదాలు చేయడం ప్రారంభించారు. ఈ సోదాలకు సంబంధించి స్థానిక పోలీసులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం అందలేదు. అయితే ఉదయం 10 గంటల సమయంలో సుబేదారి పోలీసులకు సమాచారం రావడంతోనే ఈ సోదాల విషయం బయటికి పొక్కింది. అయితే ఏకకాలంలో హైదరాబాద్‌, హనుమకొండ, మైలవరం ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేస్తున్న వార్త వెలుగులోకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. చైతన్య మహిళా సంఘంలో కొనసాగుతున్న అనిత, రాధ, జ్యోతి నివాసాల్లో ఎన్‌ఐఏ ఎందుకు సోదాలు చేస్తోందన్న ప్రశ్న అందరిలో మొదలైంది. వారికి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో గానీ, మావోయిస్టులతో గానీ సంబంధాలున్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే దీనిపై ఎన్‌ఐఏ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఈ సోదాలు పూర్తయితే గానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img