Friday, April 26, 2024
Friday, April 26, 2024

అప్పుల ఊబిలో గోవాడ సుగర్స్‌

భవిష్యత్తు ప్రశ్నార్ధకం ….???
ఆందోళనలో కార్మికులు, కర్షకులు …
ఫ్యాక్టరీ అప్పు రూ.148 కోట్లు
యేడాదికి వడ్డీ ఆరు కోట్లు …
రాజీనామాలతో తప్పుకుంటున్న అధికారులు

చోడవరం : రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలు అన్నింటిలో అగ్రగామిగా నిలుస్తూ యేటా అవార్డుల పంట పండిస్తున్న ది చోడవరం కోఆపరేటివ్‌ సుగర్స్‌(గోవాడ) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. పీకల్లోతు అప్పుల్లో చిక్కుకుంది. యేటా 9.8 శాతం పైబడి రికవరీతో నడుస్తున్న గోవాడ సుగర్స్‌ లక్ష్యాన్ని మించి గానుగాట జరిపి అవార్డులు పండిస్తోంది. 2020`21 క్రషింగ్‌ సీజన్‌ ముగిసి మూడు నెలలు దాటినప్పటికీ చెరకు సరఫరా చేసిన సభ్య రైతులకు రూ.49 కోట్లు బకాయిలు, మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించలేని దీన స్థితికి చేరుకుంది. 2004కు ముందు ఫ్యాక్టరీ సుమారు 48 కోట్లు నష్టాల్లో ఉండేదని, ఆ తరువాత పంచదార ధరలతో పని లేకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకార రంగాన్ని బ్రతికించి, నష్టాల నుండి లాభాల బాట పట్టించి, సహకార రంగాన్ని బ్రతికించారు. ఆ తరువాత 2013కు ముందు సుమారు 16 కోట్లు లాభాల బాటలో ఉండే చక్కెర కర్మాగారం.. పాలకవర్గం ఎన్నిక అనంతరం మితిమీరిన ఖర్చులతోను, 2014లో ఏర్పడ్డ హుదూద్‌ తుపాను అనంతరం తడి పంచదార అమ్మకాల్లో తీవ్ర అవినీతికి పాల్పడటంతోను 175 కోట్ల రూపాయిలు అప్పుల పాలవ్వడంతో ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఈ నేపథ్యంలో గోవాడ ఫ్యాక్టరీలో గతంలో ఎన్నడూ లేనంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఫ్యాక్టరీకు రూ.148 కోట్లు అప్పులు ఉండటంతో కొత్తగా ఫ్యాక్టరీకి రుణాలు లభించే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీలో నాలుగు లక్షల రెండు వేల 943 క్వింటాళ్ల పంచదార నిల్వలు ఉన్నప్పటికీ, ఒకేసారి అమ్మడానికి అవకాశం లేదు. దీంతో తీసుకున్న రుణాలకు యేటా వడ్డీ రూపంలో 6 కోట్ల రూపాయిలకు పైగా అదనపు భారం పడుతోంది. పంచదార నిల్వలు ఒకేసారి అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, వడ్డీ రుణ భారం తగ్గు తుంది. బహిరంగ మార్కెట్‌లో ఫ్యాక్టరీ పంచదార అమ్మకాలు కోరుతూ కొందరు కోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి వడ్డీలేని రుణాలు ఇప్పిస్తే తప్ప ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే అవకాశాలు కనిపించడం లేదు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో 24,500 మంది సభ్య రైతులు, 1600 మంది కార్మికులు, లక్షకు పైగా వ్యవసాయ కార్మికులు గోవాడ ఫ్యాక్టరీ పైనే ఆధారపడి జీవిస్తున్నారు.
క్రషింగ్‌ సీజన్‌ ముగిసి మూడు నెలలు గడిచి నప్పటికీ సభ్య రైతులకు ఎరువులు అందించలేదు. పేమెంట్లు బకాయిలతో కార్మికులు, కర్షకులు గడిచిన 3 నెలలుగా ఆందోళన చెందుతున్నారు. గోవాడ సుగర్స్‌లో ఇంటి దొంగల బెడద ఎక్కువైందని, నేటి వరకు ఎరువులు అందించకపోవడం, ఫ్యాక్టరీ ఆర్థిక స్థితిగతులు తెలుసు కుంటున్న అధికారులు ముందస్తు రాజీనామాలతో పెట్టెబేడా సర్దుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో నిర్వీర్యమైన సహకార రంగాన్ని తిరిగి బ్రతికించిన నాటి సీఎం రాజశేఖర రెడ్డి ఆశల మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌హనరెడ్డిపైనే చక్కెర కర్మాగారం కార్మికులు, కర్షకులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల నుండి ఫ్యాక్టరీ గట్టెక్కాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలని కార్మికులు, కర్షకులు కోరు తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌ రూపంలో కానీ, వడ్డీ లేని రుణం ఇప్పిస్తే కానీ రైతులకు పేమెంట్లు, కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి. తక్షణమే ప్రభుత్వం స్పందించి గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని ఆదుకోవాలని సభ్య రైతులు, కార్మికులు, రైతుసంఘాలు కోరుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img