Friday, April 26, 2024
Friday, April 26, 2024

అసైన్డ్‌ చట్ట సవరణ వద్దు

9/77 చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి
దళిత, గిరిజనులకు పంపిణీ చేసిన భూములకు రక్షణ కల్పించాలి
‘కోనేరు’ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
పేదలకు భూములు పంపిణీ చేయాలి
అసైన్‌మెంట్‌ కమిటీలను పునరుద్ధరించాలి
వ్యవసాయ కార్మిక సంఘాల చర్చావేదికలో జల్లి విల్సన్‌

విజయవాడ : దళితులు, గిరిజనులకు గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములకు రక్షణగా ఉన్న 9/77 అసైన్డ్‌ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం(బీకేఎంయూ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ కోరారు. దళితులు, గిరిజనులు సమాజంలో గౌరవంగా జీవించాలని, ఆర్థికంగా ఎదగాలనే ఉన్నతాశయంతో పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములకు రక్షణ కల్పించేందుకు చేసిన అసైన్డ్‌ చట్టాన్ని యథాతథంగా కొనసాగిస్తూ మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర క్యాబినెట్‌ 9/77 అసైన్డ్‌ చట్టంలోని సెక్షన్‌ 3ను సవరిస్తూ చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం(బీకేఎంయూ), ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యాన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం చర్చా వేదిక నిర్వహించారు. జల్లి విల్సన్‌, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతుసంఘాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జల్లి విల్సన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ మహోన్నత పోరాటం వల్ల 1975లో భూసంస్కరణల చట్టం అమల్లోకి వచ్చిందని, దాని ద్వారా 5 నుంచి 6లక్షల ఎకరాలను దళితులు, గిరిజనులు, అగ్రవర్ణ పేదలకు అసైన్‌ చేశారని చెప్పారు. పేదలకు పంపిణీ చేసిన భూములు వారి చేతుల్లోనే ఉండాలనే లక్ష్యంతో 1977లో 7/99 అసైన్డ్‌ చట్టం చేశారని తెలిపారు. కృష్ణా జిల్లాలో చల్లపల్లి రాజా భూములను కమ్యూనిస్టు పార్టీ పేదలకు పంపిణీ చేసిందని, వాటిని అసైన్‌చట్టం నుంచి మినహాయించాలని 1977లో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ స్వయంగా నాటి సీఎం జలగం వెంగళరావుకు లేఖ రాశారని, అయితే, ఆయన సాధ్యం కాదని బదు లిచ్చారని గుర్తుచేశారు.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అసైన్డ్‌ చట్టాన్ని మార్పు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని, పేదలకు అసైన్‌ చేసిన ఇంటి స్థలాలు, పొలాలను 20 ఏళ్ల తర్వాత విక్రయించవచ్చని, కొనుగోలు చేయవచ్చని రాష్ట్ర విభజన తర్వాత చంద్ర బాబు ప్రభుత్వం 7/99 చట్టానికి సవరణలు చేసిందని, దానికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయని చెప్పారు. తాజాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అసైన్డ్‌ భూములను పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చని నిర్ణయిం చడం మంచిది కాదన్నారు. దీనివల్ల పేదల చేతిలో ఇంటి స్థలం, పొలం ఉండవని, పేదల భూములను భూస్వా ములు, బడాబాబులు బలవంతంగా లాక్కునేందుకు చట్ట బద్ధంగా మార్గం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
పెద్దలకు లబ్ధి చేకూర్చేందుకే… : మాజీ ఐఏఎస్‌ శర్మ
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఎస్‌ శర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు దళితులు, గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలవారు, అగ్రవర్ణ పేదలకు సుమారుగా 55 లక్షల ఎకరాలు పంపిణీ చేశారని, దానిలో సగానికి పైగా బడాబాబుల చేతిలోకి వెళ్లిపోయాయని చెప్పారు. అసైన్డ్‌ భూములను చట్టబద్ధంగా బడాబాబులకు దక్కేలా చూసేందుకు 9/77 అసైన్డ్‌ చట్టాన్ని సవరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లో దళితులు, గిరిజనులను మభ్యపెట్టి అసైన్డ్‌ భూములను బడాబాబులు లాక్కున్నారని తెలిపారు. ఈ చట్ట సవరణను ప్రజలు అంగీకరించవద్దని సూచించారు.
వర్గ స్వభావం వదలని జగన్‌ : దడాల సుబ్బారావు
దడాల సుబ్బారావు మాట్లాడుతూ అసైన్డ్‌ చట్టానికి సవరణ చేయడం అంటే ప్రభుత్వంపై భూస్వాములు, బడాబాబులకు ఉన్న పట్టును స్పష్టం చేస్తుందని చెప్పారు. దళితులు, గిరిజనుల ఓట్లతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినా తన వర్గ స్వభావాన్ని మాత్రం విస్మరించలేదని పేర్కొన్నారు. దళితులకు భూమి కొనుగోలు పథకానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి వెంకటే శ్వర్లు మాట్లాడుతూ పేదల భూములను పెత్తందారులు సొంతం చేసుకుంటూ ఉంటే రక్షణ కల్పించేందుకు 1977లో నాటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ అసైన్డ్‌ చట్టానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఆ చట్టానికి సవరణ చేయడం అంటే పేదలకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం(బీకేఎంయూ) ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ అధికారం కోసం పేదలకు మేలు చేస్తామని వాగ్దానాలు చేస్తున్న బూర్జువా పార్టీల నాయకులు… అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నడ్డి విరిచే విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. పేదలకు భూములు పంపిణీకి చేతులు రాని పాలకులు కార్పొరేట్లకు మాత్రం కారు చౌకగా వందల ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం(సీపీఎం) ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం భూ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం(ఏఐకేఎస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి మల్నీడి యల్లమందరావు మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల అమలులో భాగంగా పేదలు భూమిని నమ్ముకుని బతికే స్థితి నుంచి భూమిని అమ్ముకుని బతికే దుస్థితికి పాలకులు తీసుకొచ్చారని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప మాట్లాడుతూ పేదల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని అసైన్డ్‌ భూమిని భూస్వాములు, వ్యాపారులు చట్టబద్ధంగా సొంతం చేసుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వ తీర్మానం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత, మహిళా సంఘాల నాయకులు ఆండ్ర మాల్యాద్రి, మేళం భాగ్యారావు, పరిశపోగు రాజేష్‌, కొండా వీరాస్వామి, నటరాజ్‌, బీసు శాంతమ్మ, రాణి, రాజేష్‌, దుర్గారావు తదితరులు మాట్లాడారు. మంత్రివర్గం చేసిన అసైన్డ్‌ చట్ట సవరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, పేదలకు భూపంపిణీ చేయాలని, తక్షణమే అన్ని స్థాయిల్లో అసైన్‌మెంట్‌ కమిటీలను పునరుద్ధరించాలని తీర్మానించారు. రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వేమూరి ఉషారాణిని నాయకుల బృందం కలిసి మంత్రివర్గం చేసిన అసైన్డ్‌ చట్ట సవరణను ఉపసంహరిం చుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించాలని, 13 జిల్లాల్లోనూ రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని తీర్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img