Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలి : లోక్‌సభలో గల్లా జయదేవ్‌

పోలవరం సవరించిన అంచనాలనే ఆమోదించాలని డిమాండ్‌
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో బడ్జెట్‌ అనుబంధ పద్దులపై నిన్న జరిగిన చర్చలో జయదేవ్‌ మాట్లాడుతూ.. తమ హక్కుల కోసం మూడేళ్లుగా రైతులు పోరాటం చేస్తుండడం చరిత్రలోనే ఎక్కడా లేదని, వారిని ఆదుకోవాలని కోరారు. పోలవరం సవరించిన అంచనాలనే ఆమోదించాలని కోరారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని, కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ 18 డిసెంబరు 2019 నుంచి రైతులు పోరాడుతున్నారని అన్నారు. హక్కుల సాధన కోసం దేశంలో ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న రైతు పోరాటం ఇదొక్కటేనని పేర్కొన్నారు. కాబట్టి అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరుతున్నట్టు చెప్పారు.అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంతోపాటు ప్రాజెక్టు నిర్మాణం కోసం సాంకేతిక సలహా మండలి చేసిన సిఫార్సుల ప్రకారం రూ. 55,548 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి 18 హామీలు ఇచ్చారని, వాటి అమలుకు ఇచ్చిన పదేళ్ల గడువు 2024కి ముగుస్తుందని, కాబట్టి రానున్న కేంద్ర బడ్జెట్‌ తమకు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా నిధులు కేటాయించి విడుదల చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img