Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది ప్రణాళికలు

ఉత్తమ గ్రామాలకు ప్రోత్సాహకాలు
డిప్యుటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

విశాలాంధ్ర-విజయనగరం : ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించే విధంగా గ్రామ అభివృద్ది ప్రణాళికలను రూపొందించాలని, డిప్యుటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. ప్రజా ప్రణాళిక ప్రచారం-2022లో భాగంగా, గ్రామస్థాయి, మండల స్థాయి అభివృద్ది ప్రణాళికల తయారీపై విజయనగరం మండల పరిధిలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు, స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణా కార్యక్రమం జరిగింది.ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యుటీ స్పీకర్‌ కోలగట్ల మాట్లాడుతూ, ప్రజలను భాగస్వాములను చేస్తూ, వారి అభిప్రాయాలను తెలుసుకొని గ్రామ అభివృద్ది ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. పాలనావ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో, 72,73వ రాజ్యాంగ సవరణ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రజలకు మరింత చేరువ అయ్యిందని, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూళనకు ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, పిల్లల స్నేహపూర్వక వాతావరణం, నీటి సమృద్ది, హరిత గ్రామాలు, పరిశుభ్రత, స్వయం సమృద్ది, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సామాజిక భద్రత లక్ష్యాలుగా గ్రామస్థాయి ప్రణాళికలను రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన జరుగుతోందని, అవినీతి, లంచగొండితనం పూర్తిగా తగ్గాయని అన్నారు. ఎటువంటి సిఫార్సులకు తావివ్వకుండా, రాజకీయాలకు అతీతంగా, అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి, అభివృద్దిలో భాగస్వాములు కావాలని కోరారు. జనవరిలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తామని, మొదటి బహుమతి క్రింద రూ.20లక్షలు, ద్వితీయ బహుమతి క్రింద రూ.`10 లక్షలు నిధులను కేటాయిస్తామని ప్రకటించారు. అభివృద్దిలో గ్రామాల మధ్య పోటీతత్వాన్నిపెంచడమే దీని వెనుక లక్ష్యమని కోలగట్ల స్పష్టం చేశారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఎంపిపి మామిడి అప్పలనాయుడు, జెడ్‌పిటిసి కెల్ల శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నడిపేన శ్రీనివాసరావు, జొన్నవలస పిఏసిఎస్‌ అధ్యక్షులు కెల్ల త్రినాధ్‌, గాజులరేగ అధ్యక్షులు జమ్ము మధుసూదనరావు, వైస్‌ ఎంపిపిలు కె,నారాయణరావు, కొసర నిర్మల, ఎంపిడిఓ గంటా వెంకటరావు, తాశీల్దార్‌ బంగార్రాజు, ఇతర మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img