Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ, జగన్‌ ప్రభుత్వాలను గద్దెదింపాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి
విశాలాంధ్ర – అనంతపురం అర్బన్‌ : దేశంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని, దీని ప్రభావం ప్రజలపై పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. మోదీ, జగన్‌ ప్రభుత్వాలను గద్దె దించడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రంలో నీలం రాజశేఖరరెడ్డి భవన్‌లో రామకృష్ణ విలేకరులతో మంగళవారం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను రామకృష్ణ ఎండగట్టారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీల ఊసేలేదన్నారు. లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి తిరుగుతున్న ప్రధాని మోదీ మిత్రులను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని తూర్పార బట్టారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, కేవలం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. ముస్లింల రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ పెద్దలు పదేపదే మాట్లాడుతున్నారని, అదే జరిగితే బీజేపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు సంబంధించి కోర్టుకు వెళ్లమని స్వయానా అమిత్‌ షా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు మండి పడ్డారు. కేజ్రీవాల్‌, సిసోదియా, కల్వకుంట్ల కవిత వంటి అనేక మందిపై ఈడీని ఉసిగొల్పుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కనబడుతోందని, జగన్‌ సొంతూరు పులివెందులలో పోలీస్‌ పహారా కొనసాగుతోందని దుయ్య బట్టారు. తల్లీ చెల్లెలను పట్టించుకోని జగన్‌ రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నిం చారు. గన్‌మెన్‌ల కళ్లుగప్పి అవినాశ్‌రెడ్డి కనిపించకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. అధికారం కోసం జగన్‌…కుటుంబ సభ్యులను, బంధువులను సైతం జైలుకు పంపుతున్నారని విమర్శించారు. జగన్‌ రాజకీయా లను భ్రస్టు పట్టించారని విరుచుకుపడ్డారు. ఏపీలో సీఎం జగన్‌, తెలంగాణలో వైఎస్‌ షర్మిల యావగింపు రాజకీ యాలు చేస్తున్నారని, అధికార దాహంతో కుటుంబాన్ని బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు ఎస్సీ, ఎస్టీల పట్ల విశ్వాసం లేదని, కడపలో నిజాయతీగల అధికారి డాక్టర్‌ అచ్చన్నను హత్య చేస్తే ప్రభుత్వం పట్టించుకోలే దన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే అచ్చన్న మృతదేహానికి పంచనామా చేశారని ఆరోపించారు. డాక్టర్‌ హంతకులతో పొలీసులు కుమ్మక్కయ్యారని తీవ్రంగా మండిపడ్డారు. విశాఖలో డా.సుధాకర్‌ ఉదంతాన్ని గుర్తు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేస్తున్నా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సీపీఐ అనంతపురం, పుట్టపర్తి జిల్లాల కార్యదర్శులు జాఫర్‌, వేమయ్య యాదవ్‌, జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, రామకృష్ణ, కేశవరెడ్డి, రమణ, రాజేశ్‌గౌడ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, సీపీఐ నగర సహాయ కార్యదర్శి అల్లిపీరా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img